Chandrababu: తెదేపాలో యువతకు పెద్దపీట

తెదేపాలో యువతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై సమగ్ర అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని మంగళవారం జరిగిన తెదేపా పొలిట్‌బ్యూరో ప్రత్యేక సమావేశం

Updated : 10 Aug 2022 04:01 IST

సమగ్ర అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు

13 నుంచి 15 వరకు ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలు

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి సేవలు అభినందనీయం

తెదేపా పొలిట్‌బ్యూరో ప్రత్యేక సమావేశంలో తీర్మానం

ఈనాడు, అమరావతి: తెదేపాలో యువతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై సమగ్ర అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాలని మంగళవారం జరిగిన తెదేపా పొలిట్‌బ్యూరో ప్రత్యేక సమావేశం నిర్ణయించింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను ఈనెల 13, 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహించాలని పొలిట్‌బ్యూరో తీర్మానించింది. ఆగస్టు 15న చంద్రబాబు ఒక జిల్లా కేంద్రంలో ప్రజల మధ్య జాతీయ జెండా ఎగరేస్తారు. ప్రతి కార్యకర్త, నాయకుడు తమ ఇళ్లపై జాతీయజెండాను ఎగరేయాలని, అన్నిచోట్లా బైక్‌ ర్యాలీలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌పై తాను పాల్గొన్న జాతీయకమిటీ సమావేశం వివరాలను చంద్రబాబు పొలిట్‌బ్యూరోకు వివరించారు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీలో యువతకు ప్రాధాన్యంపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్లాలని ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సమావేశంలో సూచించారు.

* ఎంపీ గోరంట్ల మాధవ్‌ చట్టసభల్లో ఉండటానికి అనర్హుడని, తక్షణమే ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని పొలిట్‌బ్యూరో సమావేశం డిమాండు చేసింది. ఎంపీ నగ్న వీడియో ప్రైవేటు వ్యవహారమని వైకాపా నేతలు మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని, చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి వైకాపా అధిష్ఠానం కులాల మధ్య విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని సమావేశం మండిపడింది. తెలుగుమహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను వైకాపా రౌడీలు ఫోన్‌ చేసి బెదిరించడాన్ని ఖండించింది.

* గోదావరి వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని, వరద బాధితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని పొలిట్‌బ్యూరో డిమాండు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు తెదేపా ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.6,250 కోట్లు కేంద్రం తిరిగి చెల్లించినా.. ముంపు బాధితులకు జగన్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం రూ.10 లక్షలు, సేకరించిన భూమికి రూ.5లక్షలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. రైతులకు ధాన్యం బకాయిలపై ప్రభుత్వ వైఖరిని సమావేశం ఖండించింది.

* పాఠశాలల విలీనం లక్షలమంది బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల విద్యావకాశాలను దూరం చేసిందని.. పాఠశాలల విలీనం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకూ పోరాడాలని పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.

* కామన్వెల్త్‌ క్రీడల్లో దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టిన క్రీడాకారులను పొలిట్‌బ్యూరో అభినందించింది.

* తెలుగుదనానికి నిండుదనం తెచ్చిన, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నిత్యం పనిచేసిన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తిచేసిన సందర్భంగా ఆయన సేవలను పొలిట్‌బ్యూరో కొనియాడింది. తెలుగు వ్యక్తి సాగించిన అపూర్వ ప్రస్థానంపై అభినందనలు తెలిపింది.

* బీసీ జనగణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని తీర్మానించింది. గోదావరి వరదల్లో సాయం చేసిన దాతలు, పార్టీ నేతలు, ఎన్టీఆర్‌ ట్రస్టును సమావేశం అభినందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని