Published : 10 Aug 2022 05:22 IST

బిహార్‌లో విస్తరణకు తరుణమిదే!

జేడీ(యు)తో బంధం తెగిపోవడం మంచిదేనంటున్న కమలనాథులు

దిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలన్న భాజపా ప్రణాళికలకు బిహార్‌లో తాజా రాజకీయ పరిణామాలతో కొంత ఎదురుదెబ్బ తగిలినట్లయింది! అయితే పార్టీలోని ఓ వర్గం నేతలు మాత్రం.. అంతా తమ మంచికేనన్న ధోరణితో ఉన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తరహాలో బిహార్‌లోనూ ప్రాంతీయ పార్టీలపై పైచేయి సాధించి పాలనా పగ్గాలు చేపట్టేందుకు ప్రస్తుత పరిణామాలు దోహదపడే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. బిహార్‌లో 2013 వరకు జేడీ(యు)తో కూటమిలో జూనియర్‌ భాగస్వామిగా ఉన్న భాజపా.. తర్వాత బాగా బలపడింది. 2020 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్‌ పాస్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ కారణంగా రాష్ట్రంలో కనీసం 30 స్థానాల్లో నీతీశ్‌ పార్టీ పరాజయం పాలైంది. ఇది కమలదళానికి కలిసొచ్చింది. కూటమిలో జేడీ(యు) తొలిసారి జూనియర్‌ భాగస్వామిగా మారింది. మరోవైపు- బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలుండగా.. 200 సీట్లలో బలోపేతమయ్యే దిశగా భాజపా ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఈ తరుణంలో జేడీ(యు)తో బంధం తెగిపోవడంతో రాష్ట్రంలో పార్టీ విస్తరణకు మరింత మెరుగైన అవకాశం చిక్కినట్లయిందన్నది కొందరు కమలనాథుల అభిప్రాయం. యూపీలో ఓ దశలో ఎస్పీ, బీఎస్పీ ఏకమైనా తమ పార్టీని అడ్డుకోలేకపోయిన సంగతిని వారు గుర్తుచేస్తున్నారు. బిహార్‌లోనూ ప్రాంతీయ పార్టీలను ఓడించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో నీతీశ్‌, తేజస్వీ యాదవ్‌ వంటి నాయకులను ఎదుర్కొనేందుకు కమలదళంలో బలమైన ప్రాంతీయ నేత లేరన్నది కాదనలేని వాస్తవం. ఇది ఎన్నికల్లో పార్టీకి ప్రతికూలాంశంగా మారే ముప్పుందని విశ్లేషకులు చెబుతున్నారు.

* బిహార్‌లో మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 40. గత సార్వత్రిక ఎన్నికల్లో జట్టుగా బరిలో దిగిన కమలదళం, జేడీ(యు) వాటిలో ఏకంగా 39 సీట్లను కైవసం చేసుకున్నాయి. జేడీ(యు) తోడుగా ఉంటే 2024లోనూ ఆ ఫలితాలను పునరావృతం చేసేందుకు భాజపాకు మెరుగైన అవకాశాలుండేవని.. ఇప్పుడు ఆ పార్టీ దూరం కావడం లోక్‌సభ ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని