అత్యాచారం చేస్తే, తగాదా కేసు పెడతారా?

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలానికి చెందిన ఓ మహిళ తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తగాదా కేసు పెట్టడం ఏమిటని తెదేపా

Published : 10 Aug 2022 05:41 IST

పోలీసును చంపిన రౌడీషీటర్లపై చర్యలకు జాప్యమా?

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలానికి చెందిన ఓ మహిళ తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే పోలీసులు తగాదా కేసు పెట్టడం ఏమిటని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులు సోమశేఖర్‌, అఖిల్‌, అక్కులప్పతో పాటు వారికి సహకరిస్తున్న వైకాపా నేతలను పోలీసులు తక్షణమే అరెస్టు చేయాలని డిమాండు చేశారు. ‘ఇలాంటి ఘోరాలపై మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకోగలమని సకల శాఖల మంత్రి సజ్జల అంటున్నారు. మరి ఈ కేసులో మహిళ ఫిర్యాదు చేసినా బలహీన సెక్షన్లు పెట్టడంలో మతలబేంటి?’ అని మంగళవారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్‌ గూడూరు సురేంద్రకుమార్‌ను పట్టణంలో రౌడీషీటర్లు దారుణంగా హత్య చేశారని, నేరగాళ్లకు జగన్‌రెడ్డి రాజ్యం స్వర్గమని నిరూపించారని లోకేశ్‌ విమర్శించారు. ఈ కేసులో నిందితులెవరో తెలిసినా, ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులు పట్టుకోలేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అర్థమవుతోందన్నారు. సురేంద్రకుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్యాకేజీలో భాగంగా ఎన్నో ఏళ్లుగా అమలవుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేయడం ద్వారా గిరిజనులను ప్రభుత్వం వంచించిందని లోకేశ్‌ ఆరోపించారు. చిత్తశుద్ధితో ఆదివాసీలు, ముంపు బాధితుల సమస్యలు పరిష్కరించాలని హితవు పలికారు. అడవి తల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని