ఆ ఎస్పీ ఫోరెన్సిక్‌ నిపుణుడా?

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎలా చెబుతారని.. ఆయనేమన్నా ఫోరెన్సిక్‌

Updated : 11 Aug 2022 07:12 IST

మాధవ్‌ వీడియో ఫేక్‌ అని ఎలా చెబుతారు?

ఏ ల్యాబ్‌కు పంపారు? నివేదిక ఏం వచ్చింది?

తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపాటు

ఈనాడు డిజిటల్‌, అమరావతి, తాడేపల్లి న్యూస్‌టుడే: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా ప్రచారంలో ఉన్న వీడియో ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ఎలా చెబుతారని.. ఆయనేమన్నా ఫోరెన్సిక్‌ నిపుణుడా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ప్రశ్నించారు. ‘వీడియో ఫేక్‌ అని ఎస్పీ ఎలా నిర్ధారిస్తారు? దానికి ఒక విధానం ఉంటుందిగా? ఫేక్‌ అని ఏ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ తేల్చింది? ఆ నివేదిక బయటపెట్టండి’ అని నిలదీశారు. ‘ఫేక్‌ అయితే, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నాలుగు గోడల మధ్య జరిగింది.. దాంట్లో తప్పేముందని ఎందుకు అన్నారు? అలా అయితే అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ రాసలీలలు ఇలాగే జరిగాయా? ఇంత జరుగుతున్నా ఎంపీ మాధవ్‌ను సీఎం జగన్‌.. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించడం లేదు?’ అని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఎస్పీకి బాగా తెలిసినట్లుంది..
‘వీడియో ఫేక్‌ అని 5 రోజుల తర్వాత ఎస్పీకి గుర్తొచ్చినట్లుంది. ఒకరోజు వ్యవధిలో అటు హోంమంత్రి, ఇటు ఎస్పీ.. ఫేక్‌ అనే ప్రకటనలిచ్చారు. మరి ఇది ఫేక్‌ అయితే ఒరిజనల్‌ మరోటి ఉందా? మాధవ్‌ గురించి ఎస్పీకి బాగా తెలిసినట్లుంది. ఇద్దరూ పోలీసు అధికారులే కదా!’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. ‘వైకాపా నేతలు మహిళల్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. మా అమ్మను కూడా కించపరిచేలా మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి శాసనసభలో అసభ్యంగా మాట్లాడినప్పుడు సీఎం ఎందుకు ఆపలేదు? శాసనసభలో ఆ పదాలు వాడతారా? తప్పుడు పనులు చేసి మళ్లీ మా పైనే వేస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘నేను కూడా రకరకాలుగా నిందించవచ్చు. కానీ ఎప్పుడూ అలా చేయలేదు. 2012 నుంచి నాపై దుష్పచారం చేస్తున్నారు. నాకు మరో వివాహం జరిగిందని, ఒక కుమారుడున్నాడని తప్పుడు ప్రచారం చేశారు. ఇంట్లో బాధాకరమైన సంఘటన జరిగితే దానిపై కూడా దుష్ప్రచారం చేశారు. ఆరోపణలు చేస్తారు.. ఒక్కటైనా రుజువు చేశారా? ఇవన్నీ ప్రజలు గమనించాలి’ అని అన్నారు.

పరదాల అడ్డు ఎందుకు?
‘మూడేళ్ల మూడు నెలల కాలంలో జగన్‌ ఏం చేశారు? ఇప్పుడే గుర్తొచ్చిందా కుప్పం? రాజశేఖర్‌రెడ్డి, జగన్‌ ముఖ్యమంత్రులుగా కుప్పానికి ఏం చేశారో చెప్పాలి. జగన్‌ వస్తానంటే చంద్రబాబు ఏం చేశారో చెప్పేందుకు నేను సిద్ధం. నిజంగా జగన్‌కు 175 సీట్లు గెలిచే ధీమా ఉంటే ఎందుకు అంతగా భయపడుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే చాలు 144 సెక్షన్‌. పరదాలు కట్టుకుని వెళ్లడం. ఎక్కడ ఎవరు టమోటాలు, కోడిగుడ్లు విసురుతారోనని భయం. అదే చంద్రబాబు రాయల్‌గా వెళుతున్నారు. పోలవరానికి చంద్రబాబు రాజులా వెళ్లారు. జగన్‌ మాత్రం భయపడుతూ వెళ్లారు. పరదాల వ్యాపారాన్ని రాజధానిలో ప్రారంభించి తర్వాత గుంటూరులో అమలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడికివెళ్లినా పరదాలే. ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అనే భయంతో వణికిపోతున్నారు’ అని పేర్కొన్నారు.

మంగళగిరి నుంచే పోటీ..
‘వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో వైకాపా నేతలు రూ.500 కోట్లు ఖర్చు చేస్తారని ప్రచారం ఉంది. నేను ప్రజల్లో ఉన్న మనిషిని. డబ్బు రాజకీయాలు నాకు తెలియవు. ప్రజలకు సేవ చేస్తా. చివరికి వారే నిర్ణయిస్తారు. మంగళగిరిలో ఏ సామాజికవర్గానికి ఎవరు బాగా చేశారనేది వారే తేలుస్తారు? మూడేళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా. ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాల్ని నేను చేస్తున్నా. ఇంతకన్నా ఇంకేం చెప్పాలి! ఒకవేళ పార్టీ అధినేత చంద్రబాబు సర్వేలో లోకేశ్‌ మంగళగిరికి ఏమీ చేయలేదని ప్రజలు చెబితే అందరినీ మార్చినట్లే నన్నూ మారుస్తారు. సంక్షేమం, అభివృద్ధే.. నా కులం, మతం, ప్రాంతం. ప్రతిపక్షంలోనే ఇన్ని కార్యక్రమాలు చేశాం. అధికారంలోకి వస్తే ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తామో ప్రజలు ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని