జగన్‌ స్వప్రయోజనానికే.. ‘గాలి’కి మళ్లీ గనులు

సీఎం జగన్‌ తన సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికే... కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి రాష్ట్రంలోని గనులను మళ్లీ ధారాదత్తం చేయాలని చూస్తున్నారని తెదేపా

Updated : 11 Aug 2022 11:47 IST

తెదేపా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ తన సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికే... కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి రాష్ట్రంలోని గనులను మళ్లీ ధారాదత్తం చేయాలని చూస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథరెడ్డి ధ్వజమెత్తారు. గతంలో జనార్దనరెడ్డిపై వివాదాలు చెలరేగినప్పుడు.. ఆయనెవరో తనకు తెలియదని జగన్‌ బుకాయించారని గుర్తు చేశారు. తెలియని వ్యక్తికి గనులెలా అప్పగిస్తారని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం గతంలో గాలి జనార్దనరెడ్డికి భూములిస్తే.. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆయన రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకున్నారు. రూ.15 వేల కోట్ల విలువైన గనులను అప్పట్లో ఆయనకు ధారదత్తం చేశారు. ఇప్పటికీ సుప్రీంకోర్టులో దానిపై కేసు నడుస్తోంది. ఇప్పుడు మళ్లీ ఆయనకే గనులు అప్పగించాలని చూస్తున్నారు. జనార్దనరెడ్డి కంపెనీ ఆర్‌ఆర్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు’ అని రవీంద్రనాథరెడ్డి తెలిపారు.

కుప్పం అభివృద్ధి పేరిట అసత్య ప్రచారం
‘కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.63 కోట్లు విడుదల చేశామని జగన్‌ అసత్య ప్రచారం చేసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని పులివెందుల స్థాయికి తీసుకెళతానని ఆయన అనడం హాస్యాస్పదం. సీఎం అయ్యాక రూ.2,500 కోట్ల అంచనాలతో గండికోట నుంచి చిత్రావతికి సెకండ్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ అని పేరు పెట్టి కేవలం రూ.పది కోట్ల పనులు చేసి వదిలేశారు. పులివెందులలో నీటిపారుదల వ్యవస్థంతా మైక్రో ఇరిగేషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. దీని అభివృద్ధికి జగన్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని కోసం టెండర్లు పిలిచి.. గుత్తేదారు సంస్థకు ఒక్క రూపాయి బిల్లులు కూడా చెల్లించకపోవడంతో సదరు సంస్థ వెనుదిరిగింది. నేటికీ పులివెందులలోని ప్రభుత్వ పాఠశాలకు పూర్తి స్థాయిలో విద్యా సామగ్రి రాలేదు. జగన్‌రెడ్డి సొంత మండలం సింహాద్రిపురంలో నిధులు లేక పాఠశాల మొండిగోడలకే పరిమితమైంది. స్థానిక యువత కోసం ఒక్క పరిశ్రమను జగన్‌ తీసుకురాలేదు. పులివెందులలో బస్టాండ్‌ను కూడా అభివృద్ధి చేయలేని సీఎం జగన్‌..మూడు రాజధానులు నిర్మిస్తానంటున్నారు’’ అని రవీంద్రనాథరెడ్డి మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని