గోరంట్ల వ్యవహారాన్ని సీబీఐకిచ్చే దమ్ముందా

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అసభ్య వీడియో వ్యవహారాన్ని సీబీఐకిచ్చి విచారణ చేయించే దమ్ముందా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు.

Published : 11 Aug 2022 04:48 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అసభ్య వీడియో వ్యవహారాన్ని సీబీఐకిచ్చి విచారణ చేయించే దమ్ముందా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. అనంతపురం ఎస్పీ.. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే గోరంట్ల మాధవ్‌ను కాపాడే ప్రయత్నం చేశారని బుధవారం ట్విటర్‌లో మండిపడ్డారు. ‘ఫార్వర్డ్‌ చేసిన వీడియోలే ఉన్నాయని.. ఒరిజినల్‌ వీడియో దొరికితే తప్ప నిజం నిగ్గుతేల్చలేమని ఎస్పీ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు తలచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం సులభమే’ అని పేర్కొన్నారు.

ఎస్పీ చాలా కష్టపడ్డారు..: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
గోరంట్ల మాధవ్‌ను కాపాడటానికి ఎస్పీ ఫక్కీరప్ప చాలా కష్టపడ్డారని మాజీమంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా వీడియో ఒరిజినలా కాదా అని ఎలా తేలుస్తారని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎంపీ ఫోన్‌ను స్వాధీనం చేసుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు.

హోంమంత్రి, ఎస్పీ ప్రకటనల్లో పొంతనేది?: గుంటుపల్లి శ్రీదేవి
గోరంట్ల వీడియో విషయంలో హోంమంత్రి, ఎస్పీల ప్రకటనలకు పొంతన లేదని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి ఓ ప్రకటనలో విమర్శించారు. ఆ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండానే ఒరిజినల్‌ కాదని అనంతపురం ఎస్పీ ఎలా చెబుతారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు