అభ్యర్థి ఎవరైనా అంతా సహకరించాలి

మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది. సిటింగ్‌ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా

Published : 11 Aug 2022 06:11 IST

  మునుగోడు టికెట్‌ ఆశావహులకు కాంగ్రెస్‌ పార్టీ స్పష్టీకరణ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: మునుగోడు కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి ఇచ్చినా అధిష్టానం నిర్ణయం మేరకు అందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేయాలని ఆశావహులకు పార్టీ స్పష్టం చేసింది. సిటింగ్‌ స్థానమైన మునుగోడును దక్కించుకోవడమే లక్ష్యంగా కీలక సమావేశాలను కాంగ్రెస్‌ ప్రారంభించింది. బుధవారం ఆ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్‌ ఆశావహులతో పాటు నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలతో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు సమావేశమై వివిధ అంశాలను చర్చించారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్‌ కీలకనేత, మాజీ మంత్రి కె.జానారెడ్డిని కలిశారు. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. గాంధీభవన్‌లో నల్గొండ జిల్లా, మునుగోడు నేతలతో బోసురాజుతో పాటు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ విప్‌ అనిల్‌కుమార్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లతో పాటు నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ను ఆశిస్తున్న నియోజకవర్గ నేతలు పాల్వాయి స్రవంతి, చల్లమల కృష్ణారెడ్డి, కైలాష్‌నేత, పల్లె రవికుమార్‌లు ఇందులో పాల్గొన్నారు. ఉపఎన్నికకు సంబంధించిన వివిధ అంశాలపై నాయకుల సలహాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బోసురాజు మీడియాతో మాట్లాడుతూ.. మండల పార్టీ అధ్యక్షులు రాజీనామా చేసిన ఆరు మండలాల్లో ప్రతి మండలంలో ఐదుగురు సీనియర్లతో సమన్వయ కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. ఈనెల 16 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారని, 16 నుంచి 20 వరకూ మండలాలవారీగా పార్టీ నేతలతో సమావేశమై శ్రేణులకు భరోసా కల్పిస్తారని తెలిపారు. అక్కడ సమీక్షలు, సర్వేలు పూర్తయ్యాక వచ్చే నివేదిక ఆధారంగానే అభ్యర్థి ఎంపిక జరుగుతుందని బోసురాజు స్పష్టం చేశారు. మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కూడా జానారెడ్డిని కలిసి మునుగోడు ఉపఎన్నిక, అక్కడి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. మునుగోడు ఉపఎన్నికపై గురువారం కాంగ్రెస్‌ ముఖ్యనాయకులతో గాంధీభవన్‌లో సమావేశం జరగనుంది. మాణికం ఠాగూర్‌, రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్క, సునీల్‌ కనుగోలు, మధుయాస్కీగౌడ్‌ తదితరులు పాల్గొననున్నారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదు: పాల్వాయి స్రవంతి

చండూరులో కాంగ్రెస్‌ సభ విజయవంతం కావడంతో ఇతర పార్టీలు తనపై కుట్ర చేసినట్లు మునుగోడు కాంగ్రెస్‌ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఆరోపించారు. గాంధీభవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ మూడుసార్లు పార్టీ టికెట్‌ ఇవ్వకపోయినా నిబద్ధతతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదన్నారు.


కాంగ్రెస్‌ ముఖ్యనేతల కీలక భేటీ

కాంగ్రెస్‌ ముఖ్యనేతలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు బోసురాజు, నదీమ్‌ జావేద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు తదితరులు అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఆ ఉపఎన్నికపై ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ సర్వే వివరాలను అందించినట్లు సమాచారం. ప్రధానంగా మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహం, ఆశావహుల నేపథ్యం, ప్రత్యర్థులు బలాబలాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. అంతకు ముందు మాణికం ఠాగూర్‌ సునీల్‌ కనుగోలుతో కలసి హైదరాబాద్‌లోని జానారెడ్డి నివాసానికి వెళ్లారు. మునుగోడు ఉపఎన్నిక గురించి ఆయనతో చర్చించినట్లు, గురువారం ముఖ్యనాయకుల సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరినట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని