అభ్యర్థిత్వంపై తెరాసలో విభేదాలు

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికపై తెరాసలో విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన

Published : 11 Aug 2022 06:11 IST

కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై కొందరి అసమ్మతి గళం

మంత్రి జగదీశ్‌రెడ్డి బుజ్జగింపులు

ప్రగతిభవన్‌లోనూ చర్చలు

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్థి ఎంపికపై తెరాసలో విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే మళ్లీ అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ తెరాస అధిష్ఠానానికి లేఖ రాశారు. దీంతో తెరాస శ్రేణుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి రంగంలోకి దిగారు. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. మునుగోడు బరిలో దిగేందుకు తెరాస నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు టికెట్‌ ఆశిస్తున్నారు. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం మూడు సంస్థలతో సర్వేలు నిర్వహిస్తోంది. ప్రాథమిక సర్వే ఫలితాల్లో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అనుకూలతలున్నాయనే నివేదికలు రావడం... ఆయనకు అవకాశం ఇచ్చేందుకే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు రావడంతో కూసుకుంట్లకు వ్యతిరేకంగా ఉన్న 12 మంది నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావులకు లేఖలు రాశారు. 2018 ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి వైఖరి వల్ల పార్టీ ఓటమి పాలైందని, ఈసారి పార్టీ బలంగా ఉన్నందున అభ్యర్థిని మార్చాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని చక్కబెట్టే బాధ్యతను సీఎం కేసీఆర్‌ మంత్రి జగదీశ్‌రెడ్డికి అప్పగించారు. బుధవారం ఉదయం మంత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో నిర్వహించిన సమావేశానికి మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు 30 మంది హాజరయ్యారు. వారి అభిప్రాయాలను తెలిపారు. కొందరు ప్రభాకర్‌రెడ్డిని ఎంపిక చేస్తే తాము పనిచేయబోమని తేల్చి చెప్పారు. మరికొందరు తమకే టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఇంకొందరు నేతలు ప్రభాకర్‌రెడ్డికి అనుకూలతను వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మునుగోడులో అన్ని సర్వేలు పార్టీ గెలుపును ధ్రువీకరిస్తున్నాయని, ఈ తరుణంలో అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే సీఎం కేసీఆర్‌ పార్టీ అభ్యర్థిని ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అధిష్ఠానం ఖరారు చేసిన అభ్యర్థి విజయానికి పార్టీ నాయకులు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. టికెట్‌ ఎవరికి వచ్చినా.. భవిష్యత్తులో అందరికీ తగిన అవకాశాలు ఉంటాయని నచ్చజెప్పినట్లు సమాచారం.  సాయంత్రం నేతలంతా మంత్రి నివాసం నుంచి ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లారు. గురువారం మంత్రిమండలి సమావేశంపై అధికారులతో సమావేశమైన సీఎం వారిని మరోసారి కలుస్తామని  పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌లతో నియోజకవర్గనేతలకు సమాచారం ఇచ్చారు. సీఎం అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థిని ఖరారు చేస్తారని మునుగోడు నేతలకు మంత్రి హామీ ఇచ్చారు.

అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ‘‘ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమై చర్చించాం. మునుగోడు తెరాసలో ఎలాంటి అసంతృప్తులు లేవు. సీఎం ఎవరిని అభ్యర్థిగా నిలిపినా గెలిపిస్తాం. రాజగోపాల్‌ రెడ్డి స్వార్థం కోసమే ఈ ఉపఎన్నిక వస్తోంది.  సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథను తీసుకొచ్చి ఫ్లోరోసిస్‌ సమస్యను తరిమికొట్టారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తాం.’’ అని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని