క్షుద్రవిద్యతో ప్రజావిశ్వాసం పొందలేరు

నల్లదుస్తులు ధరించి నిరసనలు వ్యక్తం చేయడం క్షుద్రవిద్యలాంటిదేననీ, దాని ద్వారా ప్రజా విశ్వాసాన్ని పొందలేరని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలపై ఈ నెల 5న పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలపడాన్ని

Updated : 11 Aug 2022 06:24 IST

నైరాశ్యంతోనే నల్లవస్త్రాలతో నిరసన

ఉచిత పథకాలు దేశానికి హాని

పన్ను చెల్లింపుదారులకు అవి భారం: మోదీ

పానీపత్‌: నల్లదుస్తులు ధరించి నిరసనలు వ్యక్తం చేయడం క్షుద్రవిద్యలాంటిదేననీ, దాని ద్వారా ప్రజా విశ్వాసాన్ని పొందలేరని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ధరల పెరుగుదలపై ఈ నెల 5న పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్‌ పార్టీ నిరసన తెలపడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. బుధవారం హరియాణాలోని పానీపత్‌లో ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐవోసీ)కి చెందిన రూ.900 కోట్ల ఇథనాల్‌ కర్మాగారాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. వీడియో సదస్సు విధానంలో మాట్లాడారు. ‘‘నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీలు నల్ల దుస్తులతో నిరసనలకు దిగాయి. తద్వారా నిరాశావాదం, వ్యతిరేక ధోరణులు తొలగిపోతాయని అనుకున్నాయి. క్షుద్రవిద్యతో చెడ్డరోజులు తొలగిపోవు. ప్రజల ఆదరణను పొందలేరు. ఉచిత పథకాలతో రాజకీయాలు చేయాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇది దేశానికి హాని. కొత్త సాంకేతికతలపై పెట్టుబడుల్ని ఇవి అడ్డుకుంటాయి. చేసే రాజకీయాల్లో స్వార్థం ఉన్నట్లయితే ఉచితంగా పెట్రోలు, డీజిల్‌ ఇస్తామని కూడా ఎవరైనా హామీ ఇవ్వవచ్చు. అలాంటి చర్యలు మన పిల్లల భవిష్యత్తుకు ప్రతిబంధకంగా నిలుస్తాయి. స్వయంసమృద్ధిని అడ్డుకుంటాయి. నిజాయతీగా పన్ను చెల్లించేవారిపై మరింత భారాన్ని మోపుతాయి. ఇది సరైన విధానం కాదు. దేశానికి వ్యతిరేకం. జాతి నిర్మాణానికి కాకుండా దేశాన్ని వెనక్కి నెట్టేసేందుకు జరిగే ప్రయత్నమిది’’ అని మోదీ విమర్శించారు.

ఇథనాల్‌తో రూ.50,000 కోట్ల ఆదా

పెట్రోలులో ఇథనాల్‌ను కలపడం ద్వారా గత ఏడెనిమిదేళ్లలో రూ.50,000 కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయగలిగామని, అంత మొత్తం రైతులకు వెళ్లిందని మోదీ తెలిపారు. పంట వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం రైతులకు లభించినట్లేనని చెప్పారు. కోతల అనంతరం మిగిలే వ్యర్థాలు రైతులకు ఆదాయ వనరుగా మారనున్నాయని, ఎనిమిదేళ్ల క్రితం 40 కోట్ల లీటర్ల మేర ఉత్పత్తి అయ్యే ఇథనాల్‌ ఇప్పుడు 400 కోట్ల లీటర్లకు చేరిందని వివరించారు.

విమర్శల్ని తిప్పికొట్టిన కాంగ్రెస్‌

నల్లదుస్తుల్లో నిరసనలపై ప్రధాని విమర్శల్ని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. మోదీ అలాంటి దుస్తుల్లో ఉన్న ఫొటోను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విటర్లో పంచుకున్నారు. దేశ సమస్యలపై ప్రధాని స్పందన కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే అనవసర అంశాలను ఆయన లేవనెత్తుతున్నారని విమర్శించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని