భాజపాకు పెద్ద కష్టమే

లోక్‌సభలో పూర్తి ఆధిక్యం ఉన్న అధికార ఎన్డీయేకు రాజ్యసభలో గడ్డు పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మాదిరిగా కీలక బిల్లులకు పెద్దల సభ ఆమోదం పొందటం అంత సులభం కాకపోవచ్చు. భాజపాతో జేడీయూ తెగదెంపులు

Published : 11 Aug 2022 06:11 IST

 నీతీశ్‌ దెబ్బతో తటస్థ పార్టీలపై ఆధారపడక తప్పదు!

వాటి సహకారంతోనే రాజ్యసభ బిల్లులకు ఆమోదం

దిల్లీ: లోక్‌సభలో పూర్తి ఆధిక్యం ఉన్న అధికార ఎన్డీయేకు రాజ్యసభలో గడ్డు పరిస్థితులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదివరకు మాదిరిగా కీలక బిల్లులకు పెద్దల సభ ఆమోదం పొందటం అంత సులభం కాకపోవచ్చు. భాజపాతో జేడీయూ తెగదెంపులు చేసుకోవటంతో సంఖ్యాపరంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది. ఏదైనా బిల్లు నెగ్గాలంటే తటస్థ పార్టీల మద్దతు తప్పనిసరి కానుంది. రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సహా జేడీయూకు ఐదుగురు సభ్యులు ఉన్నారు. కూటమిలో ఆ పార్టీ ఉన్నప్పుడు కూడా ఎన్డీయేకు పెద్దల సభలో పూర్తిస్థాయిలో మెజార్టీ లేదు. ఇప్పుడు కీలక బిల్లులు నెగ్గాలంటే తటస్థ పార్టీలైన బీజేడీ, వైకాపా మద్దతు తప్పనిసరి కానుంది.

కావాల్సినవారు 123... ఉన్నవారు 110

రాజ్యసభలో 245 స్థానాలకు గానూ ప్రస్తుతం 237 మంది సభ్యులు ఉన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో 4, త్రిపురలో ఒకటి, నామినేటెడ్‌ స్థానాలు మూడు ఖాళీగా ఉండడంతో మెజార్టీ మార్క్‌ 119గా ఉంది. ఈ సభలో భాజపా సభ్యులు 91 మంది సహా ఎన్డీయే బలం 115. జేడీయూ వైదొలగిన తర్వాత ఇది 110కి తగ్గిపోయింది. మెజార్టీకి మరో 9 స్థానాలు తక్కువవుతాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల నాటికి ముగ్గురు సభ్యులను నామినేట్‌ చేసేందుకు అవకాశం ఉంది. త్రిపురలో ఎన్నిక జరిగితే ఆ ఒక్క స్థానాన్ని భాజపా పొందే సూచనలు ఉన్నాయి. అప్పుడు రాజ్యసభలో ఎన్డీయే బలం 114కు చేరుతుంది. సాధారణ ఆధిక్యం (123) సాధించడానికి అధికార పక్షానికి మరో 9 మంది సభ్యులు తక్కువవుతారు. కీలక బిల్లులు ఆమోదం పొందాలంటే ముగ్గురు స్వతంత్రులతో పాటు 9 మంది చొప్పున సభ్యులున్న వైకాపా లేదా బీజేడీ మద్దతు అవసరమవుతుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనే కాకుండా కీలక బిల్లులు ఆమోదం పొందడంలో వైకాపా, తెదేపా, బీజేడీ, బీఎస్పీ, శిరోమణి అకాలీదళ్‌లు అధికార ఎన్డీయేకు మద్దతు ఇచ్చాయి.

హరివంశ్‌ కొనసాగుతారా, వైదొలుగుతారా?

కూటమి నుంచి వైదొలగాలని నీతీశ్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ పరిస్థితి డోలాయమానంలో పడింది. పార్టీ ఆలోచనకు తగ్గట్టుగా ఆయన రాజీనామా చేస్తారా, లేదంటే 2008లో సీపీఎం నుంచి బహిష్కృతుడైన తర్వాత కూడా స్పీకర్‌గా కొనసాగిన దివంగత నేత సోమ్‌నాథ్‌ ఛటర్జీ మార్గాన్ని ఎంచుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

పాత ముఖాలను పక్కన పెట్టిన నాటి నుంచి ప్రకంపనలు

బిహార్‌లో 2020లో శాసనసభ ఎన్నికలు ముగిసి జేడీయూ-భాజపా సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి ఏదో ఒక లుకలుకలు ఉండేవి. సుశీల్‌కుమార్‌ మోదీ వంటి పాత ముఖాలను పక్కనపెట్టిన నాటి నుంచి అవి మరింత తీవ్రమయ్యాయని రెండు పార్టీల నేతలూ చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని