‘కూసుకుంట్ల’కు టికెట్‌ ఇవ్వొద్దు

మునుగోడు తెరాసలో అసమ్మతి మరోసారి బయటపడింది. ఉపఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టికెట్‌ వస్తుందని సంకేతాలు రావడంతో అసమ్మతి నేతలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌

Published : 13 Aug 2022 04:59 IST

మునుగోడు తెరాసలో మరోసారి బయటపడిన అసంతృప్తి

చౌటుప్పల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: మునుగోడు తెరాసలో అసమ్మతి మరోసారి బయటపడింది. ఉపఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టికెట్‌ వస్తుందని సంకేతాలు రావడంతో అసమ్మతి నేతలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ ఛైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, సింగిల్‌విండో ఛైర్మన్‌ చింతల దామోదర్‌ రెడ్డి, సంస్థాన్‌ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్‌చందర్‌ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు వీరమల్ల భానుమతి వెంకటేశం, నాంపల్లి జడ్పీటీసీ సభ్యుడు అలుగోటి వెంకటేశ్వర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ రజనీ వెంకన్నలతో పాటు పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. చౌటుప్పల్‌, నాంపల్లి, నారాయణపురం మండలాల నుంచి అత్యధికంగా తెరాస సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సొంత పార్టీ నాయకులపైనే కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని, అలాంటి వ్యక్తికి పార్టీ టికెట్‌ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో పనిచేయబోమని వారు తేల్చి చెప్పారు. 2018లో ప్రభాకర్‌రెడ్డి ఓటమికి ఇదే కారణమని, ఇప్పుడు మళ్లీ టికెట్‌ ఇస్తే పరాజయం ఖాయమని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉండటంతో కూసుకుంట్లకు పార్టీ టికెట్‌ ఇవ్వొద్దని తీర్మానం చేశారు. తీర్మానం ప్రతులను అధిష్ఠానానికి పంపనున్నారు. పార్టీ బాగు కోసం, మునుగోడులో గులాబీ జెండా ఎగరాలంటే మరొకరికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నామని చౌటుప్పల్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఏ సామాజికవర్గానికి టికెటిచ్చినా అందరం కలిసి పనిచేస్తామని అన్నారు.

మంత్రి పర్యటించిన కాసేపటికే..

మునుగోడు నియోజకవర్గంలో ఈ నెల 20న జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి స్థల పరిశీలన చేసిన కొద్దిసేపటికే అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పర్యటనలో పాల్గొన్న కొంతమంది ముఖ్య ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో కూడా పాల్గొనడం గమనార్హం. ఈ నెల 10న బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు హైదరాబాద్‌లో చర్చలు జరిపారు. మునుగోడు తెరాసలో ఎలాంటి అసంతృప్తులు లేవని, సీఎం కేసీఆర్‌ ఎవరిని అభ్యర్థిగా నిలిపినా గెలిపిస్తామని చెప్పారు. అయితే శుక్రవారం నాటి సమావేశంతో తెరాసలో విభేదాలు ఇంకా సద్దుమణగలేదని తేలిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని