మండలాలవారీగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు

మునుగోడులోనే ఈ నెల 20న బహిరంగసభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.  సీఎం ఆదేశాలతో శుక్రవారం మునుగోడు, నారాయణపురం, చండూరు మండలాల్లో పలు ప్రాంతాలను పరిశీలించి మంత్రి జగదీశ్‌రెడ్డి,

Published : 13 Aug 2022 04:59 IST

భారీ సభకు తెరాస సన్నాహం
అభ్యర్థిగా కూసుకుంట్లనే సీఎం ప్రకటించే అవకాశం
తెరాస మునుగోడు ప్రచారంలో కేటీఆర్‌, హరీశ్‌రావులు

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడులోనే ఈ నెల 20న బహిరంగసభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.  సీఎం ఆదేశాలతో శుక్రవారం మునుగోడు, నారాయణపురం, చండూరు మండలాల్లో పలు ప్రాంతాలను పరిశీలించి మంత్రి జగదీశ్‌రెడ్డి, తెరాస నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా  అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, తెరాస ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లులు శుక్రవారం రాత్రి సీఎంను కలిసి నివేదికలు ఇచ్చారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా ఈసభను నిర్వహించాలని భావిస్తున్న తెరాస భారీఎత్తున జనసమీకరణకు వీలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు లక్ష్యాల్ని నిర్దేశించింది. ఎమ్మెల్యేలకు మండలాలవారీగా బాధ్యతలు అప్పగించింది. స్థానిక ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న 40 ఎకరాల స్థలంలో సభ నిర్వహిస్తారు. శనివారం నుంచి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు హాజరై ప్రసంగిస్తారు. సభా నిర్వహణ బాధ్యతలను మంత్రి జగదీశ్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు, సభ ఏర్పాట్ల బాధ్యతను గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి ప్రచారానికి వెళ్లలేదు. ఇది తెరాస ఓటమికి ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో రెండు మూడుసార్లు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సీఎం యోచిస్తున్నారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, మరో మంత్రి హరీశ్‌రావులను సైతం ఎన్నికల ప్రచారంలోకి దించనున్నారు. ఇక్కడ తెరాస అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డివైపే అధిష్ఠానం మొగ్గు చూపుతోంది. వివిధ సర్వేలతో పాటు గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయానికి వచ్చింది. మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌.. కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించే వీలుంది. మరోపక్క సీఎం వద్ద సమావేశంలో మునుగోడు నియోజకవర్గంలోని సమస్యలపై నేతలు చర్చించారు. గ్రామాలు, మండలాలు, పురపాలికలు, వార్డుల వారీగా వివిధ అంశాలపై నివేదికలు రూపొందించి ఇవ్వాలని ఈ   సీఎం సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని