స్వలాభం కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

తెరాస ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి.. మునుగోడు ఉపఎన్నికలో తెరాసను గెలిపిస్తాయని, రెండో స్థానంలో ఉండేందుకు భాజపా, కాంగ్రెస్‌  పోటీపడతాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ

Published : 13 Aug 2022 04:59 IST

మునుగోడు ఉపఎన్నికలో తెరాసదే విజయం: మంత్రి జగదీశ్‌రెడ్డి  
సీఎం బహిరంగసభకు స్థల పరిశీలన

మునుగోడు, న్యూస్‌టుడే: తెరాస ప్రభుత్వ పథకాలు, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి.. మునుగోడు ఉపఎన్నికలో తెరాసను గెలిపిస్తాయని, రెండో స్థానంలో ఉండేందుకు భాజపా, కాంగ్రెస్‌  పోటీపడతాయని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 20న జరిగే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ కోసం శుక్రవారం ఆయన జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరితో కలిసి స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. స్వలాభం కోసం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారని, నియోజకవర్గ అభివృద్ధి కోసమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. భాజపాకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గ్యాస్‌ ధరలు పెంచి ఇంట్లో మంటలు పెడుతున్న ఆ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. గెలిచే పార్టీలో ఆశావహులు పోటీ పడటం సహజమేనని.. కేసీఆర్‌ నిర్ణయానికి అందరూ కట్టుబడి.. ఎలాంటి వర్గ పోరుకు తావు లేకుండా తెరాస అభ్యర్థి విజయానికి కలిసి పనిచేస్తామని మంత్రి వెల్లడించారు. ఈ నెల 20న నిర్వహించే భారీ బహిరంగ సభలో భాజపా అరాచక పాలన తీరును సీఎం కేసీఆర్‌ ప్రజలకు వివరిస్తారని తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్సీ, తెరాస జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని