కేసీఆర్‌ ఒక్కరు కొట్లాడితేనే తెలంగాణ రాలేదు: సంజయ్‌

కేసీఆర్‌ ఒక్కరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ముఖ్యమంత్రి బూటకపు వాగ్దానాలతో ప్రజలను దగా చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఆయన చేపట్టిన మూడో విడత

Published : 13 Aug 2022 04:59 IST

నార్కట్‌పల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కేసీఆర్‌ ఒక్కరు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ముఖ్యమంత్రి బూటకపు వాగ్దానాలతో ప్రజలను దగా చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఆయన చేపట్టిన మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర 10వ రోజు శుక్రవారం రాత్రి నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలనే ఈ పాదయాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. ఒక్కసారి భాజపాకు అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. పేదోళ్లు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, అలాంటి తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం ఇష్టారాజ్యంగా ఏలుతోందని విమర్శించారు. 10లక్షల కొత్త పింఛన్లు, గట్టుప్పల్‌ మండల ఏర్పాటు, సర్పంచుల ఖాతాల్లో నిధులు వంటివన్నీ భాజపా ఘనతేనని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వస్తే అమ్మనబోలును మండలంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. రూ.కోట్ల ఆదాయం వస్తున్న నార్కట్‌పల్లి మండంలోని చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయరని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి హామీలు ఎటు పోయాయని నిలదీశారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చే వరకు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి మాట్లాడారు. భాజపా ప్రశ్నించినందుకే బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన జరిగిందన్నారు. అమ్మనబోలు విద్యార్థులు చదువుకోవాలంటే 40కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాశ్‌, సంగప్ప, మండలాధ్యక్షుడు కొరివి శంకర్‌, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రామన్నపేట మండలం పల్లివాడ సమీపంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌ పాదయాత్రలో పాల్గొని బండి సంజయ్‌తో పాటు ముందుకు సాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని