రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి

చండూరుసభలో తనను పార్టీ నాయకుడు తిట్టినందుకు ఆ సభకు అధ్యక్షత వహించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మునుగోడు ఎన్నికల

Published : 13 Aug 2022 04:59 IST

మునుగోడు పార్టీ కార్యక్రమాలపై సమాచారం లేదు
పిలవని పేరంటానికి వెళ్లను: ఎంపీ వెంకట్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: చండూరుసభలో తనను పార్టీ నాయకుడు తిట్టినందుకు ఆ సభకు అధ్యక్షత వహించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ ముఖ్యనాయకుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మునుగోడు ఎన్నికల కార్యక్రమాలకు సంబంధించి పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొంటూ.. పిలవని పేరంటానికి వెళ్లనని అన్నారు. పార్టీ నుంచి తనను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తాను మాత్రం కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. శుక్రవారం తన నివాసం వద్ద వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. మునుగోడు ఉపఎన్నికల సమావేశం సమాచారం తనకు లేదన్నారు. శనివారం నిర్వహించే పాదయాత్ర గురించి కూడా తనకు తెలియదని, తననెవరూ ఆహ్వానించలేదని తెలిపారు. తనను దారుణంగా తిట్టిన వ్యక్తిని ఆ సభలోనే సస్పెండ్‌ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. ఆ మాటలతో తాను మానసికక్షోభ అనుభవిస్తున్నానని అన్నారు. తనతో పాటు 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్‌ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబుతో పాటు తనను హోంగార్డులతో పోల్చిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోవడం, ఉత్తుత్తిగా షోకాజు నోటీసులు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ‘హోంగార్డులు, బ్రాందీషాపులు’ అన్న మాటలను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పి ఆహ్వానిస్తేనే మునుగోడు ప్రచారానికి వెళ్తానన్నారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ రెండు రోజులు హైదరాబాద్‌లో ఉన్నా తనతో మాట్లాడలేదన్నారు. ఆయన సీనియర్‌ నాయకుడు జానారెడ్డి ఇంటికి వెళ్లినా తనకు కనీసం ఫోన్‌కూడా చేయలేదన్నారు. ఎంతోమంది అన్నదమ్ములు వేర్వేరు పార్టీల్లో ఉన్నారని, అన్ని విషయాలపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీతోనే మాట్లాడుతానని, అధిష్ఠానంతోనే తేల్చుకుంటానని వెంకట్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని