ప్రభుత్వ శాఖలు విద్యుత్‌ బకాయిలు ఎందుకు చెల్లించడంలేదు?

విద్యుత్‌ వినియోగదారులపై అడ్డగోలుగా భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

Published : 13 Aug 2022 05:14 IST

మొదట ముఖ్యమంత్రి జగన్‌ ఇంటి ఫ్యూజులు పీకేయాలి

తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌

ఈనాడు, అమరావతి: విద్యుత్‌ వినియోగదారులపై అడ్డగోలుగా భారం మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ప్రశ్నించారు. డిస్కంలకు రూ.15,474 కోట్ల సబ్సిడీ బకాయిలతో పాటు, వివిధ ప్రభుత్వ శాఖలు వాడుకున్న విద్యుత్‌కు మరో రూ.9,783 కోట్లు ప్రభుత్వం బకాయిపడిందని, దాన్ని ఎందుకు చెల్లించడం లేదన్నారు. శుక్రవారం తెదేపా కేంద్ర కార్యాలయంంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ఒక పేదవాడు కేవలం రూ.100 బకాయి పడితేనే ఫ్యూజు పీకేసే విద్యుత్‌ శాఖ అధికారులు... డిస్కంలకు రూ.25,257 కోట్ల బకాయిలు పెట్టినందుకు  సీఎం ఇంటికి వెళ్లి ఫ్యూజులు పీకే సాహసం చేయగలరా?’’ అని ఆయన నిలదీశారు. ‘‘డిస్కంలు రూ.39 వేల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ప్రధాన కారకుడు జగన్‌రెడ్డే. విద్యుత్‌రంగం పేరు చెప్పి చేసిన అప్పుల్ని దారిమళ్లించి దోచుకున్న ఆయన... దానికిప్పుడు ప్రజల్ని బాధ్యుల్ని చేస్తున్నారు. ఆ భారాల్ని ప్రజలపై మోపుతున్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తానని పిట్టకథలు చెబుతున్న జగన్‌రెడ్డి... డిస్కంలకు రూ.15,474 కోట్ల సబ్సిడీ సొమ్ము ఎప్పుడు చెల్లిస్తారో సమాధానం చెప్పాలి. తెదేపా పాలనలో ఏ-గ్రేడ్‌లో ఉన్న డిస్కంలను సి-గ్రేడ్‌కి పడగొట్టిన అసమర్థుడు జగన్‌రెడ్డి. ఆయన విద్యుత్‌ వ్యవస్థను దివాళా తీయించడం వల్లే రాష్ట్రానికి ఒక్క పరిశ్రమా రావడం లేదు...’’ అని పట్టాభి ధ్వజమెత్తారు. ‘‘ఏపీకి తెలంగాణ రూ.6 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. తన మిత్రుడైన తెలంగాణ సీఎం  కేసీఆర్‌ ముక్కుపిండి ఆ బకాయిలు వసూలు చేయకుండా జగన్‌రెడ్డి ప్రజలపై ఎందుకు భారం మోపుతున్నారు?...’’ అని పట్టాభి నిలదీశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని