ఎవరికివారే అభ్యర్థిగా ఊహించుకోవద్దు

‘ఏ ఎన్నికలోనైనా ఆశావహులు చాలామంది ఉంటారు. గెలుపు గుర్రానికే అవకాశం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. మునుగోడు ఉపఎన్నికకు తెరాస అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని, ఎవరికివారే ఊహించుకొని

Updated : 14 Aug 2022 08:22 IST

గెలుపు గుర్రానికే అవకాశం

ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: ‘ఏ ఎన్నికలోనైనా ఆశావహులు చాలామంది ఉంటారు. గెలుపు గుర్రానికే అవకాశం ఉంటుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. మునుగోడు ఉపఎన్నికకు తెరాస అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానానిదే తుది నిర్ణయమని, ఎవరికివారే ఊహించుకొని ఆశలు పెట్టుకోవద్దని స్పష్టంచేశారు. అన్ని విధాలుగా కసరత్తు చేసి అభ్యర్థిని ఎంపిక చేస్తామని, సరైన సమయంలో ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ ప్రయోజనాలే ముఖ్యంగా అభ్యర్థిని గెలిపించేందుకు స్థానిక నేతలు కష్టపడి పనిచేయాలన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రయత్నించవద్దని సూచించారు. శనివారం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎంపిక అంశాన్ని సీఎం ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఏ నిర్ణయం తీసుకోలేదు..

‘‘పార్టీ అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎవరికి వారు తామే అభ్యర్థి అనుకోవద్దు. 2014లో గెలిచిన పార్టీ 2018లో కొద్ది తేడాతో ఓడింది. తర్వాత స్థానిక ఎన్నికల్లో పుంజుకుంది. నియోజకవర్గంపై సంపూర్ణ అవగాహనతోనే నిర్ణయం తీసుకుంటాం. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకునే పూర్తి బాధ్యత పార్టీమీదే ఉంటుంది. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో పనిచేయాలి’’ అని సీఎం సూచించినట్లు తెలిసింది.

శుక్రవారం దండుమల్కాపురంలో ఓ నాయకుని విందు పిలుపు మేరకు పార్టీనేతలు హాజరయ్యారని, అది అసమ్మతివాదుల భేటీ కాదని ఆయా నేతలు సీఎంకు తెలియజేసినట్లు సమాచారం. అందులో కొందరు నేతలు అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారని సీఎంకు వివరించారు. 

కంచర్ల సోదరులతో ప్రత్యేకంగా భేటీ!

ఈ సమావేశం అనంతరం నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డితో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారని తెలిసింది. మునుగోడు టికెట్‌ ఆశిస్తున్న వారిలో కృష్ణారెడ్డి ఒకరు. ఈ నేపథ్యంలో వారిని పిలిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అభ్యర్థి ఎంపికపై సర్వేలు సాగుతున్నాయని, పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తీసుకున్నామని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో బంధువర్గాలు, స్నేహితులున్నందున పార్టీ అభ్యర్థి విజయంలో కంచర్ల సోదరులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. మున్ముందు కృష్ణారెడ్డికి మంచి భవిష్యత్తు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 20న జరిగే సభ విజయవంతానికి కృషి చేయాలని వారికి సూచించారు.

వేనేపల్లిపై సస్పెన్షన్‌ ఎత్తివేత

మునుగోడు నియోజకవర్గంలో సీనియర్‌ నాయకుడైన వేనేపల్లి వెంకటేశ్వర్‌రావు శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశమయ్యారు. నాంపల్లి మండలానికి చెందిన ఆయన తెదేపా నుంచి 2012లో తెరాసలో చేరారు. 2014లో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయానికి కృషిచేశారు. 2018 ఎన్నికల్లో తనకు టికెట్‌ కావాలని అధిష్ఠానాన్ని కోరారు. మరోసారి కూసుకుంట్లనే అభ్యర్థిగా ఎంపిక చేయడంతో.. నిరసనగా వేనేపల్లి భారీసభ నిర్వహించారు. ఈ క్రమంలో అధిష్ఠానం ఆయనను సస్పెండ్‌ చేసింది. సీఎం కేసీఆర్‌ శనివారం వెంకటేశ్వర్‌రావును పిలిపించి, సస్పెన్షన్‌ ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో సముచిత స్థానమిస్తామని, ఉపఎన్నికలో పార్టీఅభ్యర్థి విజయానికి కృషిచేయాలని సూచించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts