ప్రజలే గుంతలు పూడ్చాల్సి రావడం.. ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం

రాష్ట్రంలో రహదారులపై పడిన గుంతలను ప్రజలే పూడ్చాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రోడ్డు ప్రమాదాల్లో

Updated : 14 Aug 2022 06:39 IST

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్రంలో రహదారులపై పడిన గుంతలను ప్రజలే పూడ్చాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి కనీస స్పృహ లేదని శనివారం ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు. ‘తారు రోడ్డుపై గుంత కారణంగా మనిషి చనిపోయేంత వరకు నిద్రపోతున్న ప్రభుత్వం..ఆ తర్వాతా మేల్కోకపోవడం దురదృష్టకరం. ఈ నెల 4న విశాఖకు చెందిన రవ్వా సుబ్బారావు రహదారిపై గుంత కారణంగా ప్రమాదానికి గురై మరణించారు. అక్కడే మరో ప్రమాదంలో ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తమకు కలిగిన బాధ మరెవరికీ కలగకూడదని మృతుడి కుటుంబసభ్యులే ఆ గుంతను పూడ్చారు. వైకాపా నేతలకు అధికారమిచ్చి, పన్నుల రూపంలో వాళ్ల చేతికి డబ్బులిచ్చి, చివరికి వాళ్లు చేయాల్సిన పనిని కూడా మనమే చేసుకోవాల్సి రావడం బాధాకరం’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

మొదట దేశం అన్న భావనతో పనిచేయాలి...
‘నేషన్‌ ఫస్ట్‌’ అనే భావనతో అందరూ పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 75 వసంతాల స్వాతంత్య్ర భారతంలో దేశవ్యాప్తంగా రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం ప్రజలందరిలో భావోద్వేగాన్ని నింపుతోందని శనివారం ట్వీట్‌ చేశారు. ‘ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేద్దాం. జాతీయభావం పెంపొందేలా కార్యక్రమాలు నిర్వహిద్దాం. 75 ఏళ్ల భారతావని ప్రగతిలో 40 ఏళ్ల తెదేపా  భాగస్వామిగా ఉండడం గర్వకారణం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

తెదేపా కేంద్ర కార్యాలయంలో..
మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ‘హర్‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్సీ అశోక్‌బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, ఎన్నారై, మీడియా విభాగాల సమన్వయకర్తలు చప్పిడి రాజశేఖర్‌, నరేంద్రబాబు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని