TRS: వికారాబాద్‌ తెరాసలో సై అంటే సై!

వికారాబాద్‌ జిల్లాలో తెరాస ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు ద్వితీయశ్రేణి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో సమస్య ఎక్కువగా ఉంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ

Updated : 14 Aug 2022 08:56 IST

రెండు పురపాలికల్లో అధ్యక్ష పదవి మార్పు అంశంతో తార స్థాయికి విభేదాలు

ఈనాడు, సంగారెడ్డి, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లాలో తెరాస ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు ద్వితీయశ్రేణి నేతలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా తాండూరు, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో సమస్య ఎక్కువగా ఉంది. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిల మధ్య కొంతకాలంగా అగాధం పెరుగుతూ వస్తోంది. వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, మహేందర్‌రెడ్డిల మధ్య కూడా ఇదే పరిస్థితి ఉంది. శనివారం వికారాబాద్‌ వచ్చిన మహేందర్‌రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను తన వర్గీయులతో కలిసి పర్యవేక్షించారు. ఎమ్మెల్యే ఆనంద్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆ అవసరం తనకు లేదన్నారు. అలాగే జడ్పీ అధ్యక్షురాలు పట్నం సునీతా మహేందర్‌రెడ్డి వికారాబాద్‌ నియోజకవర్గంలో ఇటీవల పర్యటించగా ఎమ్మెల్యే ఆనంద్‌ వర్గీయులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పంచాయతీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వరకు వెళ్లింది.

ఇలా ఎందుకంటే..

తాండూరులో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసి తెరాస అభ్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపై విజయం సాధించిన పైలట్‌ రోహిత్‌రెడ్డి..  అనంతరం తెరాసలో చేరారు. తాండూరు పురపాలిక ఛైర్మన్‌ పదవి చెరో రెండున్నరేళ్లు తీసుకునేలా అధ్యక్షురాలు స్వప్న, ఉపాధ్యక్షురాలు దీపల మధ్య పార్టీ నేతలు ఒప్పందం కుదిర్చారు. రెండున్నరేళ్ల తర్వాత కూడా స్వప్న ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. ఒప్పందం ప్రకారం దీపకు అవకాశం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి, ఆయన వర్గీయులు పట్టుబడుతున్నారు. ఎలాగైనా స్వప్ననే కొనసాగించాలనే పట్టుదలతో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. వికారాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. ఈ పురపాలిక అధ్యక్షురాలిగా మంజుల కొనసాగుతున్నారు. రెండున్నరేళ్లు గడిచిన నేపథ్యంలో ఆమె పదవి నుంచి దిగిపోయి పుష్పలతారెడ్డికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్‌ వైరివర్గం నుంచి ఉంది. ఈ అంశాలే నేతలు వర్గాలుగా చీలిపోవడానికి కారణమవుతోందనే విమర్శలున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్‌ వికారాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించి పలు అభివృద్ధిలో పనుల్లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భంగానైనా సీఎం జోక్యం చేసుకుని ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య కుదిరిస్తే పార్టీకి మంచి జరుగుతుందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని