అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయ్‌!

నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయంపాలన కోసం శ్రీకాంతాచారి లాంటి వాళ్లు ప్రాణత్యాగం చేశారని, కేసీఆర్‌ పాలనలో ఆ ఆకాంక్షలు నేరవేరకపోవడంతో అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు

Published : 14 Aug 2022 06:06 IST

ప్రజాసంగ్రామ యాత్రలో సంజయ్‌

ఈనాడు, నల్గొండ- న్యూస్‌టుడే, మోత్కూరు: నీళ్లు, నిధులు, నియామకాలు, స్వయంపాలన కోసం శ్రీకాంతాచారి లాంటి వాళ్లు ప్రాణత్యాగం చేశారని, కేసీఆర్‌ పాలనలో ఆ ఆకాంక్షలు నేరవేరకపోవడంతో అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్‌ యాదాద్రి జిల్లా మోత్కూరు మండలంలోని మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి స్వగ్రామమైన పొడిచేడులో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుతో ఉద్యమకారులంతా అయోమయంలో పడిపోయారన్నారు. మేధావులు, కవులు, కళాకారులు భాజపాకు మద్దతివ్వాలని కోరారు. పాదయాత్రలో బండి సంజయ్‌ వెంట సినీనటి జీవిత ఉన్నారు. పదకొండో రోజు నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వద్ద ప్రారంభమైన యాత్ర పొడిచేడు, అనాజిపురం, ధర్మాపురం మీదుగా మోత్కూరుకు 16 కి.మీ. మేర సాగింది. అనాజీపురం వద్ద బుడగ జంగాల కాలనీలోని కడమంచి వద్ద గుడిసెలో నివసిస్తున్న వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. అమ్మనబోలులోని ప్రజాసంగ్రామ యాత్ర శిబిరం వద్ద మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనాజిపురం వద్ద రైతు యాదగిరి పత్తి చేనులోకి వెళ్లి ట్రాక్టర్‌ నడిపారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌ రావు, తుంగతుర్తి నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కడియం రామచంద్రయ్య, యాత్ర ప్రముఖ్‌ మనోహర్‌రెడ్డి, నాయకులు దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ: జీవిత

పార్టీ ఆదేశిస్తే రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి అయినా పోటీ చేసేందుకు సిద్ధమేనని  సినీనటి జీవిత తెలిపారు. సంజయ్‌ పాదయాత్రలో పాల్గొన్న ఆమె మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రకు మద్దతు తెలపడానికే ఇక్కడికి వచ్చానన్నారు.

నేడు జనగామ జిల్లాకు

దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: బండి సంజయ్‌  ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం సాయంత్రం జనగామ జిల్లాలో ప్రవేశించనుంది. ఈ నెల 22 వరకు ఈ జిల్లాలో ఆయన యాత్ర కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని