జాబ్‌ క్యాలెండర్‌పై జగన్‌ మోసం

‘జగన్‌ బటన్‌ నొక్కుడు ముఖ్యమంత్రి. బటన్‌ నొక్కడం తప్ప మరొక ఆలోచన లేదు. ఎప్పుడన్నా బయటకు రావాలంటే పెద్ద తుపాను రావాలి. అప్పుడు కూడా

Published : 15 Aug 2022 04:58 IST

యువ మోర్చా ర్యాలీ ముగింపు సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే-కృష్ణలంక: ‘జగన్‌ బటన్‌ నొక్కుడు ముఖ్యమంత్రి. బటన్‌ నొక్కడం తప్ప మరొక ఆలోచన లేదు. ఎప్పుడన్నా బయటకు రావాలంటే పెద్ద తుపాను రావాలి. అప్పుడు కూడా ప్రజల మధ్యలోకి కాకుండా.. చుట్టూ తన మనుషులను పెట్టుకుని ఆయనే చప్పట్లు కొట్టించుకుంటారు. ఆయన ఆలోచనా సరళి ఈ రాష్ట్రానికి ఎంత మాత్రం మేలు చేయదు. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని తట్టి లేపాలన్న ఆలోచనతోనే ఈ యాత్ర చేపట్టాం’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఈ నెల 2న తిరుపతిలో బీజేవైఎం ఆధ్వర్యంలో ‘యువ సంఘర్షణ యాత్ర’ చేపట్టారు. కోస్తా జోన్‌ బైక్‌ ర్యాలీ ఆదివారం విజయవాడలోకి ప్రవేశించింది. ర్యాలీకి సోము వీర్రాజు, మాజీ మంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎం రమేష్‌ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం ప్రదర్శన విజయవాడలోని వివిధ ప్రాంతాలగుండా సాగింది. ఇందులో నేతలు కొద్ది దూరం స్వయంగా ద్విచక్రవాహనాలను నడిపారు. ముగింపు సభ ధర్నాచౌక్‌లో జరిగింది. ఆయా సమావేశాల్లో భాజపా నేతలు మాట్లాడారు. రాష్ట్రానికి ఇంతవరకు రాజధాని లేదని.. రైతులు, యువత, మహిళలు, అన్ని వర్గాలు రోడ్డున పడ్డాయని ఈ సందర్భంగా సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 12 రోజులపాటు యాత్ర చేపట్టామని అన్నారు. 2.4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ జగన్‌ జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి మాటతప్పారని విమర్శించారు. అన్ని ప్రాంతాల యాత్రలు పూర్తయ్యాక 21న విజయవాడలో భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, ఎంపీ సీఎం రమేష్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కేతిరెడ్డి సురేంద్రమోహన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంశీ, విష్ణువర్ధన్‌రెడ్డి, శివన్నారాయణ, భాజపా ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బబ్బూరి శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు