జనం తెగిస్తే తట్టుకోలేరు

రాజకీయ నేతల వ్యవహారశైలిపై కోపంతో ప్రజలు రోడ్డుమీదకు వస్తే.. శ్రీలంకలో జరిగిందే ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. ‘పోలీసు వ్యవస్థ

Published : 15 Aug 2022 04:58 IST

ప్రజలకు ఆశపెట్టి ఆడుకుంటున్న వైకాపా

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శలు

ఈనాడు-అమరావతి: రాజకీయ నేతల వ్యవహారశైలిపై కోపంతో ప్రజలు రోడ్డుమీదకు వస్తే.. శ్రీలంకలో జరిగిందే ఆంధ్రప్రదేశ్‌లోనూ జరుగుతుందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు. ‘పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయవ్యవస్థను ఎదిరించగలం.. మా దగ్గర గూండాలున్నారు, రూ.లక్షల కోట్ల డబ్బుంది, పొలాలు, ఆస్తులు ఉన్నాయని బరితెగించిన నేతలు రాజకీయాలను బూతుపురాణంగా మార్చారు. వారి అరాచకాల్ని సహించలేక.. ప్రజలు తెగిస్తే వారు తట్టుకోలేరు. వైకాపా అయినా.. మరో పార్టీ అయినా’ అని పేర్కొన్నారు.‘శ్రీలంకలో జనం తరిమేయడంతో.. అధ్యక్షుడే దేశం విడిచి పరిగెత్తారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అక్కడి వరకు రాకూడదనే కోరుకుందాం. ఇప్పటికైనా నేతలు మేలుకోవాలి’ అని సూచించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం జనసేన ఐటీ విభాగ ముగింపు సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. ‘సంక్షేమ పథకాలకు నేను వ్యతిరేకం కాదు, వాటి మీదనే వ్యవస్థ నడపడమంటే.. ప్రజల్ని మరింత బలహీనంగా తయారు చేయడమే. అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎలా?’ అని స్పష్టం చేశారు.

వైకాపావి పోంజీ పథకాలే
‘మీరు పది రూపాయలు పెడితే 48 గంటల్లో రూ.40... తర్వాత మూడు రోజులకు రూ.100 అవుతుంది’ అంటారు. అవే పోంజీ పథకాలు.. మనుషుల అత్యాశకు గాలం వేస్తారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వమూ అదే చేస్తోంది. మద్యపాన నిషేధం అని, సీపీఎస్‌ రద్దు చేస్తామని ఆశ పెడతారు. లక్షల ఉద్యోగాలిస్తాం అని యువతను ఉద్రేక పరుస్తారు. మనకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇస్తామని ఆశపెడతారు. అమెరికాలో ప్రజల్ని మోసం చేసిన పోంజీ ఆలోచనా ధోరణి ఉన్న వారే ఇలా మన ఆశలతో ఆడుకుంటారు. అలాంటి ప్రభుత్వాలపై స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలి’ అని పవన్‌కల్యాణ్‌ ఐటీ విభాగ ప్రతినిధులకు సూచించారు. ‘వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవి.. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం..ఈ అనుభవంతో వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీ ఇస్తాం’ అని చెప్పారు. ‘కొందరు రాజకీయ నేతలు కేజీఎఫ్‌, ట్రిపుల్‌ ఆర్‌, బాహుబలి మ్యూజిక్‌ పెట్టుకుని నడుస్తుంటారు.. హీరోలు కావాలని ఉంటే అయిపోండి.. నేనూ చూస్తుంటా’ అని ఎద్దేవా చేశారు. దేశ విభజన సమయంలో.. దారుణమైన రక్తపాతం చోటు చేసుకుందని, ఆ చరిత్ర చదివితే దేశాన్ని దోచుకోవడానికి ఎవరికీ మనస్కరించదని పవన్‌కల్యాణ్‌ ఆవేదన వెలిబుచ్చారు. ‘భారతదేశం ఎప్పుడూ మతం కాదు, మానవత్వాన్నే చూసింది. ఇంత గొప్ప దేశంలో ఉన్నందుకు గర్వించాలి’ అని ఉద్బోధించారు. ‘అధికార వికేంద్రీకరణ జరగాలి.. పంచాయతీల నిధులు వాటికే అందాలి. మహిళలకు లోక్‌సభ, శాసనసభలో 33% సీట్లు ఉండాలి. జనసేన పార్టీకి ఒక ఎంపీ ఉన్నా.. దీనిపై సభలో ప్రైవేటు బిల్లు పెట్టేవాళ్లం’ అని పేర్కొన్నారు.

జీరో బడ్జెట్‌ రాజకీయమని చెప్పలేదు
జీరో బడ్జెట్‌ రాజకీయం చేయమని తాను ఎప్పుడూ చెప్పలేదని, ఓట్లు కొనకూడని రాజకీయమనే చెప్పానని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. ‘గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన పెద్దస్థాయి వ్యక్తులు కూడా రూపాయి ఖర్చు పెట్టలేదు. పక్కన తిరిగే కార్యకర్తలకు భోజనం కూడా పెట్టించలేదు. అదేమంటే మీరే కదా రూపాయి ఖర్చు పెట్టవద్దని చెప్పారు.. అని అన్నారు. వారికి అలా అర్థమైందా అనుకున్నా’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘పదవులు వచ్చేస్తాయి, ముఖ్యమంత్రి అయిపోతామనే ఆలోచన లేదు. ఒక తరానికి బాధ్యత గుర్తు చేయడానికి.. మరో తరాన్ని మేలుకొలపడానికే జనసేన పార్టీ పెట్టాం. స్థాయి, ఆ స్థోమత మనకు ఉంటే ప్రజలు కచ్చితంగా మనకు అవకాశం ఇస్తారు’ అని పేర్కొన్నారు. అనంతరం ఐటీ విభాగం రాష్ట్ర ఛైర్మన్‌ మిరియాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో 16 మందితో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పది జిల్లాల సమన్వయకర్తలకు నియామక పత్రాలను పవన్‌కల్యాణ్‌ అందించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts