మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు నమోదు చేయాలి

బహిరంగ ప్రదేశంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తుపాకీ కాల్చారని ఆయనపై కేసు నమోదు చేసి రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని భాజపా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటిదాకా తుపాకీని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని

Published : 15 Aug 2022 05:39 IST

 భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: బహిరంగ ప్రదేశంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తుపాకీ కాల్చారని ఆయనపై కేసు నమోదు చేసి రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని భాజపా ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. ఇప్పటిదాకా తుపాకీని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో రఘునందన్‌రావు విలేకరులతో మాట్లాడుతూ.. మంత్రిపై కేసు నమోదు చేయకుంటే హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. ‘‘పోలీసులు ప్రైవేటు వ్యక్తికి తుపాకీ ఇవ్వడం చట్టరీత్యా నేరం. మంత్రితోపాటు ఎస్పీపై రాష్ట్ర డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రి వాడిన తుపాకీలో రబ్బర్‌ బుల్లెట్లు ఉన్నాయని మొదట చెప్పిన పోలీసులు.. అందులో అసలు బుల్లెట్లే లేవని సాయంత్రం కొత్త కథ అల్లారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న డీజీపీ సేవలను మరోరకంగా వాడుకుంటామని ఇటీవల కమాండ్‌ కంట్రోల్‌ ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం చెప్పారు. ‘‘పదవీ విరమణ తరవాత ప్రత్యేక సలహాదారు హోదా కోసమే మౌనం వహిస్తున్నారా? వీటికి డీజీపీ సమాధానం చెప్పాలి. మూడు రోజుల క్రితం కూడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైరింగ్‌ చేశారని తెలిసింది. కాల్పుల ఘటనలో తప్పు చేసిన వారందరిపైనా కేసులు నమోదు చేయాలి’’ అని రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు.

కాల్పుల ఘటనపై పోలీసులకు ఫిర్యాదు

మహబూబ్‌నగర్‌ నేర విభాగం, న్యూస్‌టుడే: పాలమూరులో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర వజ్రోత్సవాల ర్యాలీ ప్రారంభోత్సవం సందర్భంగా పోలీసుల తుపాకీతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గాలిలోకి కాల్పులు జరిపారని, దానిపై కేసు నమోదు చేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచారి ఆదివారం మహబూబ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశంలో తుపాకీతో కాల్పులు జరపడం చట్టరీత్యా నేరమని రెండో పట్టణ ఠాణాలో చేసిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై సీఐ ప్రవీణ్‌కుమార్‌ను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. మంత్రిపై భాజపా నాయకులు చేసిన ఫిర్యాదుపై న్యాయ సలహాలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని