ఈడీ వేధింపులు అసత్యం

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)ని ఉపయోగించుకుంటోందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఈడీని ఉసిగొలిపితే

Published : 15 Aug 2022 05:39 IST

అదే నిజమైతే కేసీఆర్‌ సహా మంత్రులు, ఎమ్మెల్యేల్లో 50 శాతం అవుట్‌: సంజయ్‌

మోత్కూరు, న్యూస్‌టుడే: కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌)ని ఉపయోగించుకుంటోందంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఈడీని ఉసిగొలిపితే తెలంగాణలో కేసీఆర్‌తో పాటు 50శాతం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ మిగలరని ఆయన అన్నారు. 2014, 2018 ఎన్నికల అఫిడవిట్ల నడుమ వారి ఆస్తుల్లో ఎంత తేడా ఉందో చూస్తే అసలు విషయం తెలిసిపోతుందన్నారు. చీకోటి ప్రవీణ్‌పై ఆధారాలు వచ్చాయి కనుకే ఈడీ విచారణ చేపట్టిందని సంజయ్‌ పేర్కొన్నారు. భాజపా ప్రజాసంగ్రామ యాత్ర ఫలితంగానే మరో 3.3 లక్షల కొత్త పింఛన్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారని ఆయన అన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 12వ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, గుండాల మండల పరిధి గుండాల, పాచిల్ల, తుర్కలషాపురం, పెద్దపడిశాల, వత్సకొండూరు, బండకొత్తపల్లి గ్రామాల్లో సాగింది. తుర్కలషాపురంలో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. ప్రజాసంగ్రామ యాత్రకు భయపడే ముఖ్యమంత్రి పింఛన్లు, చేనేత బీమా అమలు చేస్తున్నట్లు చెప్పారన్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమకు టచ్‌లో లేరని ఓ ప్రశ్నకు బదులిస్తూ సంజయ్‌ తెలిపారు.

* తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలు భాజపాలో చేరే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. నల్గొండ జిల్లాలో తెరాస ఎమ్మెల్యేలు, నాయకులే నేరుగా హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు గాల్లో కాల్పులు జరిపి రజాకార్ల పాలనను తలపిస్తున్నారని విమర్శించారు. తెరాస ప్రభుత్వానికి కొందరు అధికారులు కొమ్ముకాస్తున్నారని అలాంటి వారి జాబితా సేకరిస్తున్నామని చెప్పారు. కార్యక్రమాల్లో భాజపా రాష్ట్ర నాయకులు బూడిద బిక్షమయ్యగౌడ్‌, దాసరి మల్లేశం, మనోహర్‌రెడ్డి, కడియం రామచంద్రయ్య, తుమ్మల మురళీధర్‌రెడ్డి, బొట్టు అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. యాత్ర ఆదివారం సాయంత్రమే జనగామ జిల్లాలోకి ప్రవేశించాల్సి ఉండగా సరిహద్దులో ఆగింది. 

నేటి నుంచి జనగామ జిల్లాలో యాత్ర

జనగామ అర్బన్‌, న్యూస్‌టుడే: సంజయ్‌ యాత్ర సోమవారం జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రానికి చేరుకోనుంది. భారీ కటౌట్లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని