అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం

వైకాపా ప్రభుత్వం సంక్షేమం ముసుగులో అభివృద్ధిని విస్మరించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా

Published : 15 Aug 2022 06:03 IST

జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం సంక్షేమం ముసుగులో అభివృద్ధిని విస్మరించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి యువత భవిష్యత్తు నాశనం చేస్తోందని ఆరోపించారు. దావోస్‌ వెళ్లి ఫొటోలకు ఫోజులిచ్చినంత మాత్రాన పెట్టుబడులు రావని, హైదరాబాద్‌ ఐటీ రంగంలో దూసుకుపోతుంటే ఏపీ రోజురోజుకు దిగజారుతోందని విమర్శించారు. జనసేన ఐటీ విభాగం ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో మనోహర్‌ ఆదివారం మాట్లాడారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అమరావతి సహా ఏ నగరంలోనూ ఐటీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన సదుపాయాలను జగన్‌ ప్రభుత్వం కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని డిమాండు చేశారు. ‘రాష్ట్ర అభివృద్ధికి, ఐటీ రంగ విస్తరణకు దోహదపడేలా జనసేన కొత్త ఐటీ విధానంతో వస్తుంది. పారిశ్రామికవేత్తల్ని, పెట్టుబడుల్ని ఆకర్షించేలా ఆ విధానం ఉంటుంది. అక్టోబరు 5 నుంచి పవన్‌కల్యాణ్‌ యాత్ర ప్రారంభమవుతుంది. అప్పటికల్లా రాష్ట్రంలోని 670 మండలాల్లో ఐటీ సమన్వయకర్తల నియామకం పూర్తికావాలి. లక్ష మంది ఐటీ వాలంటీర్లు తయారుకావాలి’ అని మనోహర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని