మళ్లీ వైకాపా వస్తే ఆడబిడ్డలకు కష్టమే

‘వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు మాన, ప్రాణ రక్షణ ఉండదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కవు. ఈసారి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఓటేయండి. వైకాపా అద్భుతమైన పాలన అందించి ఉంటే ప్రభుత్వ

Published : 16 Aug 2022 06:08 IST

ఓట్లను చీలనివ్వను.. పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు మాన, ప్రాణ రక్షణ ఉండదు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కవు. ఈసారి ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఓటేయండి. వైకాపా అద్భుతమైన పాలన అందించి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాట అనేవాణ్ని కాదు. అలా లేకుండా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నందునే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పా. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి జనసేన వైపు చూడండి. అన్ని వ్యవస్థలను బలోపేతం చేసి రాష్ట్రానికి ఆర్థిక పురోగతి సాధిస్తా. కుటుంబం కన్నా దేశం అంటే ఇష్టం. అలాంటి దేశంపై ఒట్టేసి చెబుతున్నా. తుదిశ్వాస వరకు రాజకీయాలను వదలను’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశాక పవన్‌ మాట్లాడారు. ‘పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ డంపింగ్‌యార్డుకు స్థలమిస్తే అక్కడి ఎమ్మెల్యే ఆయన్ను రాత్రికి రాత్రి బదిలీ చేయించారు. స్థానిక సంస్థల్లో నిజాయతీగా పనిచేసే మరో అధికారిని హింస పెట్టారు. దిల్లీలో వైకాపా ఎంపీలు ఏం మాట్లాడతారో మనకు తెలియదా? వైకాపా నాయకుల వేషాలన్నీ మన ముందే. వెళ్లి ప్రధాని ముందు వేయమనండి. సరిగ్గా సమాధానం చెబుతారు. వైకాపా ఎమ్మెల్యేలూ.. మీరు ప్రజలపై దాడి చేస్తే ఎదురుదాడి చేసే రోజులొస్తాయి. గూండాలైన మీకే అంత తెగింపు ఉంటే దేశభక్తులమైన మాకెంత తెగింపు ఉండాలి’ అని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ‘గుడివాడలో ఒకప్పుడు ఇసుక తోలేందుకు 350 ట్రాక్టర్లుండేవి. ఇప్పుడు 150 ట్రక్కులు వచ్చాయి. ఆ ట్రాక్టర్లకు పని లేకుండా చేసేశారు. 20టన్నులు తీసుకెళ్లే ట్రక్కుల్లో 40 టన్నుల ఇసుక వేస్తున్నారు. ఆ డబ్బు మొత్తం వైకాపా ఎమ్మెల్యేకు వెళ్లిపోతుంది. జనసేన అధికారంలోకి వస్తే ఆ ట్రాక్టర్ల వారందరికీ ఆదాయం వచ్చేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు. ‘కులం ఆధారంగా రాజకీయం చేయడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి మాటల ప్రకారం నేను ఒక కులానికి చెందినవాడినైతే ఆ కులమంతా నాకు ఓటేసి ఉంటే 40నుంచి 50సీట్లు వచ్చేవి. నేను ప్రజానాయకుణ్ని. ఓటు ఆధారిత సెక్యులరిజం వైపు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు వెళ్లవద్దు’ అని పవన్‌ సూచించారు. జాతీయ నేతలకు కులం ఆపాదించకూడదని, మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని జనసేన రెండు తీర్మానాలు ఆమోదించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వీటిని ప్రవేశపెట్టగా నాయకులు ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని