దేవరుప్పుల రణరంగం

జనగామ జిల్లా దేవురుప్పులలో సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుని.. రక్తసిక్తంగా మారింది. దేవురుప్పుల కూడలిలో సంజయ్‌

Published : 16 Aug 2022 06:09 IST

ప్రజాసంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత

భాజపా, తెరాస కార్యకర్తల పరస్పర దాడి.. ఆరుగురికి గాయాలు

ఈనాడు-వరంగల్‌, దేవురుప్పుల రూరల్‌, జనగామ టౌన్‌, న్యూస్‌టుడే: జనగామ జిల్లా దేవురుప్పులలో సోమవారం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భాజపా, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుని.. రక్తసిక్తంగా మారింది. దేవురుప్పుల కూడలిలో సంజయ్‌ ప్రసంగిస్తూ.. యువతకు కేసీఆర్‌ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారంటూ ప్రశ్నించారు. అక్కడున్న తెరాస మండల ప్రధాన కార్యదర్శి చింత రవి అడ్డుతగిలి.. కేంద్రం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో మొదట చెప్పాలని ప్రశ్నించారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో భాజపా నేత, యాదాద్రి జిల్లా గుండాల సర్పంచి మల్లేశ్‌, బీజేవైఎం కార్యకర్త గంగాపురం కార్తీక్‌, తెరాస కార్యకర్తలు కోతి ప్రవీణ్‌, వడ్లకొండ శ్రీకాంత్‌, గాదరి శ్రీకాంత్‌లతో పాటు స్థానిక మహిళ గొడిశాల సత్తెమ్మ గాయపడ్డారు. వీరిని జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. రాళ్ల దాడిలో అయిదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి.

దౌర్జన్యం చేస్తారా..

తాము శాంతియుతంగా పాదయాత్ర చేస్తే తెరాస కార్యకర్తలు దౌర్జన్యంగా దాడి చేయడం ఏమిటని బండి సంజయ్‌ మండిపడ్డారు. జనగామ జిల్లా కామారెడ్డిగూడెంలో తమ పార్టీని జెండా గద్దెను ఆదివారం అర్ధరాత్రి కూల్చివేశారని.. ఇది తెరాస కార్యకర్తల పనేనని ఆరోపించారు. డీజీపీకి ఫోన్‌ చేసి.. వరంగల్‌ సీపీపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడినవారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోకపోతే గాయపడ్డవారితో డీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఘర్షణలు చల్లారాక సంజయ్‌ పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. ధర్మారంలో లబ్ధిదారులకు పంపిణీ చేయని రెండు పడకగదుల ఇళ్లను పరిశీలించారు.

నిలదీస్తే.. దాడులు చేస్తారా: మంత్రి దయాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం గురించి ప్రజలు నిలదీసినందుకే సంజయ్‌తో పాటు వచ్చిన గూండాలు ప్రజలపై, తెరాస కార్యకర్తలపై దాడి చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంపై, తనపైనా సంజయ్‌ అనుచితంగా మాట్లాడారన్నారు. దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెరాస కార్యకర్తలతో పాటు సత్తెమ్మను మంత్రి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి పరామర్శించారు.

కేసీఆర్‌ ప్రభుత్వాన్ని, పార్టీని ఎవరూ రక్షించలేరు: కిషన్‌రెడ్డి

ఈనాడు-దిల్లీ, గన్‌ఫౌండ్రి-న్యూస్‌టుడే: ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కోట్లు ఖర్చుపెట్టినా కేసీఆర్‌ కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు గ్రామగ్రామాన పాతరేస్తారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాస ఉండేది ఇంకా ఆరేడు నెలలేనని.. ఆ తర్వాత ఆ పార్టీ, ప్రభుత్వం ఉండదన్నారు. బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని తెరాస మంత్రి సమర్థించుకోవడం ఘోరమన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు తెరాస కనుసన్నల్లో పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. బండి సంజయ్‌ పాదయాత్రపై దాడిని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎన్‌.రాంచందర్‌రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీరుద్రమ, సంగప్ప, సుభాష్‌ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని