Updated : 17 Aug 2022 06:14 IST

దేశంలోనే విఫల ముఖ్యమంత్రి కేసీఆర్‌

 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం, మిషన్‌ భగీరథతో ఒరిగిందేమిటి?

వికారాబాద్‌లో సీఎం చెప్పినవన్నీ అబద్ధాలే: బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత విఫల ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను రూ.4 లక్షల కోట్లకుపైగా అప్పుల్లో ముంచేసి పుట్టబోయే ఒక్కో బిడ్డపైనా రూ.1.20 లక్షల భారం మోపిన వ్యక్తి దేశంలో ఇంకెవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. వికారాబాద్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. భాజపాపై ఆయన చేసిన విమర్శలపై స్పందిస్తూ సంజయ్‌ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. వికారాబాద్‌ జిల్లాకు సాగు, తాగునీటి సౌకర్యం లేకుండా చేసింది ముమ్మాటికీ కేసీఆరే అని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించి ఏళ్లకుఏళ్లు గడుస్తున్నా, రూ.వేల కోట్లు ఖర్చుచేసినా 10 శాతం పనులూ పూర్తికాలేదని విమర్శించారు. ‘కేసీఆర్‌ గొప్పగా చెప్పుకొంటున్న పథకాలన్నీ అట్టర్‌ ఫ్లాప్‌ కార్యక్రమాలే. రూ.1.3 లక్షల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది. మిషన్‌ భగీరథకు రూ.40 వేల కోట్లకుపైగా ఖర్చుపెట్టినా అనేక గ్రామాలకు నీళ్లే రావట్లేదు. పెట్రోలు, డీజిల్‌ రేట్లను కేంద్రం పెంచిందని గాయి చేస్తున్న కేసీఆర్‌..కర్ణాటకలో రూ.10 తక్కువధర ఉన్న విషయం తెలుసుకోవాలి. సుపరిపాలన విషయంలో నరేంద్రమోదీ ఎక్కడ? మీరెక్కడ?’ అంటూ సంజయ్‌ దుయ్యబట్టారు.

ప్రధాని మోదీ ఉచితాలకు వ్యతిరేకం కాదు

ఈనాడు, వరంగల్‌, పాలకుర్తి, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్రమోదీ ఉచిత సంక్షేమ పథకాలకు వ్యతిరేకం అన్నట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రధాని ఉచిత పథకాలకు వ్యతిరేకం కాదని.. కేవలం స్కీముల పేరుతో చేసే స్కాములకు వ్యతిరేకమని పేర్కొన్నారు. మంగళవారం ప్రజా సంగ్రామయాత్రను ఆయన జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూరు నుంచి ప్రారంభించారు. ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాలకుర్తి కూడలిలో మాట్లాడుతూ... నాడు ఖాసిం రజ్వీ ప్రజలను పీడిస్తే నేడు కల్వకుంట్ల చంద్రశేఖర రజ్వీ (కేసీఆర్‌) రాక్షసపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. మునుగోడులో తెరాస ఒక్కో ఓటుకు రూ.30 వేలు పంచేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ఈసారి సెప్టెంబరు 17న కేసీఆర్‌ మెడలు వంచి విమోచన దినోత్సవం జరిపేలా భాజపా పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.  పాదయాత్రలో చాకలి ఐలమ్మ మనవడు రామచంద్రంను బండి సంజయ్‌ శాలువాతో సత్కరించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని