2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

ఎర్రకోట సాక్షిగా గతంలో దేశప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చలేదని, ఇప్పుడు మరిన్ని వాగ్దానాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. 2047 నాటికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవడం

Published : 17 Aug 2022 05:49 IST

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ఎర్రకోట సాక్షిగా గతంలో దేశప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నెరవేర్చలేదని, ఇప్పుడు మరిన్ని వాగ్దానాలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీ రామారావు విమర్శించారు. 2047 నాటికి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకోవడం మంచిదే. కానీ 2022 ఆగస్టు 15కి సాధిస్తామని గతంలో ఇచ్చిన హామీల సంగతి ఏమిటి? అంటూ ‘క్యా హువా తేరా వాదా?’ హ్యాష్‌ట్యాగ్‌తో నిలదీశారు. ‘‘2022 నాటికి దేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్డి సౌకర్యం కల్పిస్తామని 2014లో హామీ ఇచ్చారు. 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని, ప్రతి భారతీయుడికి సొంత ఇల్లు కట్టిస్తామని 2018లో హామీ ఇచ్చారు. ఇవన్నీ మాటలకే పరిమితమయ్యాయి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఆయా వాగ్దానాల వివరాలను మంత్రి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘మీరు చెప్పినవి చేయలేనప్పుడు జవాబుదారీతనం ఎక్కడ ఉంటుంది? మీ వైఫల్యాలను మీరే గుర్తించలేకపోతున్నారు.. వాటి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికైనా జవాబు చెబుతారా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని