Updated : 18 Aug 2022 06:43 IST

లక్ష్మణ్‌కు భాజపాలో కీలక స్థానం

తెలంగాణ నుంచి తొలిసారి నేరుగా ప్రాతినిధ్యం

ఈనాడు, హైదరాబాద్‌: భాజపాలో అత్యున్నత నిర్ణయాత్మక మండలి పార్లమెంటరీ బోర్డులో తెలంగాణకు తొలిసారి నేరుగా ప్రాతినిధ్యం లభించింది. పార్టీ అధిష్ఠానం సీనియర్‌ నేత కె.లక్ష్మణ్‌కు ఈ మేరకు అవకాశం కల్పించింది. 2020 అక్టోబరులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఆయన్ను నియమించిన అధిష్ఠానం..ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకూ పంపింది. తాజాగా పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పార్లమెంటరీ బోర్డులోకి ఆయన్ను తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యం, సామాజిక సమీకరణాల కోణంలో కమలదళం ఆయన్ను వ్యూహాత్మకంగానే బోర్డులోకి తీసుకుందని పార్టీ వర్గాల సమాచారం.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌కు చెందిన లక్ష్మణ్‌ రాష్ట్ర భాజపాలోని అత్యంత సీనియర్‌ నేతల్లో ఒకరు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి 1999, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. నగర భాజపా అధ్యక్షునిగా, జాతీయ కార్యదర్శిగా, రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాసనసభలో భాజపా పక్ష నేతగానూ వ్యవహరించారు. ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రాష్ట్రంలో ఒక సీటుకే పరిమితమైనప్పటికీ, లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకుంది. అనంతరం బండి సంజయ్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించిన అధినాయకత్వం ఆ తర్వాత కొద్ది నెలలకే లక్ష్మణ్‌కు ఓబీసీ మోర్చా జాతీయ బాధ్యతలు అప్పగించింది. గతంలో తెలంగాణ నుంచి బంగారు లక్ష్మణ్‌ జాతీయ అధ్యక్షుని హోదాలో పార్లమెంటరీబోర్డులో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకయ్యనాయుడు ఆ బోర్డులో స్థానం పొందారు. తెలంగాణనుంచి బోర్డులో స్థానం పొందిన నేత కె.లక్ష్మణ్‌ ఒక్కరేనని పార్టీ వర్గాలు తెలిపాయి.

కార్యకర్తకు లభించిన గౌరవం ఇది: లక్ష్మణ్‌

పార్లమెంటరీ బోర్డులోకి తనను తీసుకోవడాన్ని కార్యకర్తకు పార్టీ ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. నియామక నిర్ణయం అనంతరం ఆయన  ‘ఈనాడు’తో మాట్లాడారు. ‘పార్టీ నాయకత్వం దక్షిణాదిపై, మరీ ముఖ్యంగా తెలంగాణపై దృష్టి సారించింది. అందులో భాగంగానే నాకు ఈ అవకాశం కల్పించినట్లు భావిస్తున్నానని’ ఆయన తెలిపారు.

బండి సంజయ్‌ హర్షం

పార్లమెంటరీ బోర్డులో లక్ష్మణ్‌కు చోటుకల్పించడం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలో కీలక కమిటీల్లో తెలంగాణ బిడ్డకు అవకాశం దక్కడం  తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవమని తెలిపారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని