Published : 18 Aug 2022 05:11 IST

భారత్‌ యాత్రకు కేజ్రీవాల్‌

 దేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలుపుదామని పిలుపు  

సుపరిపాలన లక్ష్యంగా అయిదు మార్గదర్శకాల వెల్లడి

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. ‘భారత్‌ను ప్రథమ స్థానంలో నిలుపుదాం’(మేక్‌ ఇండియా నం.1) అనే నినాదం రూపంలో తమ పార్టీ జాతీయ ఆకాంక్షను ఆవిష్కరించారు. దిల్లీలోని తాల్కటోర స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చుకోవాలంటే ఇప్పటి వరకూ పాలిస్తున్న వారికి దేశాన్ని అప్పగించరాదని కోరారు. సుపరిపాలన సాధనకు అయిదు మార్గదర్శకాలను ప్రతిపాదించారు. దీనిని కార్యరూపంలోకి తెచ్చేందుకు అవసరమైన ప్రజా మద్దతను కూడగట్టేందుకు దేశ వ్యాప్తంగా పర్యటించనున్నట్లు తెలిపారు.

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్న  చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు భాజపా, కాంగ్రెస్‌ సహా అన్ని రాజకీయ పార్టీల శ్రేణులు కలిసిరావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతమైన జాతీయ ఉద్యమం కనుక పౌరులందరూ చేతులు కలపవచ్చని పేర్కొన్నారు. ‘75 ఏళ్లుగా పాలిస్తున్న పార్టీలకే దేశాన్ని అప్పగిస్తే మరో 75 ఏళ్లు వెనుకబడిపోతామ’ని హెచ్చరించారు. కొందరు నేతలు వారి కుటుంబం కోసం, మరికొందరు వారి స్నేహితుల కోసం రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు.

సుపరిపాలనకు అయిదు మార్గదర్శకాలు

దేశాన్ని ప్రపంచంలోనే నం.1 స్థానంలో నిలపాలంటే...అయిదు సూత్రాలను తక్షణమే అమలుచేయాలని కేజ్రీవాల్‌ సూచించారు. ఇవి సుపరిపాలనకూ మార్గం సుగమం చేస్తాయని అభిప్రాయపడ్డారు.

* దేశంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి. నిరక్షరాస్యతను సమూలంగా నిర్మూలించేందుకు పాఠశాలలను విరివిగా ప్రారంభించాలి.

* దేశ పౌరులందరికీ నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలి. ఔషధాలనూ ఉచితంగా సరఫరా చేయాలి.

* యువత అందరికీ ఉద్యోగాలిస్తే వారి సంపాదనతో కుటుంబాలన్నీ సుసంపన్నం అవుతాయి. అప్పుడు దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారిపోతుంది.

* ప్రతి మహిళకూ గౌరవమైన, సురక్షితమైన జీవితాన్ని గడిపే అవకాశం కల్పించాలి. సమాన హక్కులుండాలి.

* రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలకు హామీనివ్వాలి. వ్యవసాయదారుల పిల్లలు తామూ రైతులమవుతామని సగర్వంగా చెప్పుకోగలగాలని కేజ్రీవాల్‌ తెలిపారు. జాతీయ లక్ష్య సాధనకు దేశ ప్రజలందరూ తమతో కలిసిరావాలని ఆప్‌ నేత కోరారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని