అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదు

గత నెల 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదని మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. తద్వారా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపిక, పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులను పార్టీ

Published : 18 Aug 2022 05:11 IST

 మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు

చెన్నై, న్యూస్‌టుడే: గత నెల 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం చెల్లదని మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది. తద్వారా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి ఎంపిక, పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులను పార్టీ పదవుల నుంచి తొలగించడం చెల్లదని స్పష్టం చేసింది. న్యాయం తమవైపే ఉందని ఈ సందర్భంగా పన్నీర్‌ సెల్వం హర్షం వ్యక్తం చేశారు. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే సమన్వయకర్తగా పన్నీర్‌సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా ఎడప్పాడి పళనిస్వామి పార్టీని నడిపిస్తున్నారు. వారి మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో.. జులై 11న చెన్నై వానగరంలో అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దాంతో పాటు పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులైన పలువుర్ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ పళనిస్వామి వర్గం చర్యలు తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం, ఆ పార్టీ సర్వసభ్య సభ్యుడు వైరముత్తులు మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణన్‌ రామస్వామి విచారించారు. విచారణ బాధ్యతల నుంచి ఆయన్ను మార్చాలని ఓపీఎస్‌ తరఫున ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రం సమర్పించారు. దీంతో కృష్ణన్‌ రామస్వామి స్వయంగా విచారణ నుంచి తప్పుకొన్నారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌కు విచారణ బాధ్యతలు అప్పగించారు.   జులై 11న జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని, జూన్‌ 23కి ముందునాటి పరిస్థితే కొనసాగాలంటూ బుధవారం ఆయన తీర్పు చెప్పారు. సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్తలు కలిసే సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ఇందుకు పరిశీలకుణ్ని నియమించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని