‘కాళేశ్వరం’ నిషేధిత ప్రాంతమా?

కాళేశ్వరం నిషేధిత ప్రాంతమా? అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు

Published : 18 Aug 2022 05:11 IST

 ఎందుకు అడ్డుకుంటున్నారు?: భట్టి  ఆగ్రహం

భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్‌ నేతల అరెస్టు

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, భూపాలపల్లి, గణపురం, న్యూస్‌టుడే: కాళేశ్వరం నిషేధిత ప్రాంతమా? అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి ముంపు ప్రాంతాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపునకు గురైన కన్నెపల్లి పంపుహౌస్‌ సందర్శనకు వెళ్తున్న సీఎల్పీ బృందాన్ని బుధవారం భూపాలపల్లి పట్టణంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని ఠాణాకు తరలించడానికి యత్నించగా తోపులాట, తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నాయి. అనంతరం కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి గణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వ తీరు చూస్తుంటే కాళేశ్వరం ఉందా? మాయమైందా? తాము చూడకూడనివి అక్కడ ఏమైనా ఉన్నాయా? అని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. తాము కాళేశ్వరం వస్తున్నట్లు పది రోజుల ముందే అధికారులకు తెలిపామని, ప్రాజెక్టు గురించి వివరించేందుకు ఇంజినీర్లను కూడా ఏర్పాటు చేయాలని కోరామన్నారు. అయినా అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేపైనా, పదిరోజులకైనా  కాళేశ్వరం వెళ్లి అక్కడి రహస్యాలను బయటకు తీస్తామన్నారు. మంథని  పరిధిలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును అక్కడి శాసనసభ్యుడు శ్రీధర్‌బాబు కూడా సందర్శించకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ నేతలను విడుదల చేసి ప్రభుత్వమే దగ్గరుండి ప్రాజెక్టులు చూపించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని