టీచర్లను వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ హక్కుల కోసం టీచర్లు ఉద్యమించడం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు రుచించనందునే

Published : 18 Aug 2022 05:19 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను వేధిస్తోందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ హక్కుల కోసం టీచర్లు ఉద్యమించడం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు రుచించనందునే వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు.. హక్కుల కోసం పోరాడాలని ఉపాధ్యాయులను జగన్‌ రెచ్చగొట్టారని, నాడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎలాగని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎనిమిదేళ్లకోసారి ఉపాధ్యాయుల బదిలీలు ఉండేవని, ఇప్పుడు ఐదేళ్లు పూర్తయినవారిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసిందని అన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో దాదాపు 70శాతం ఉపాధ్యాయుల బదిలీలు ఖాయమని వివరించారు. ఈ బదిలీల వెనకా కుట్రకోణం ఉందని ఆరోపించారు. బయోమెట్రిక్‌ విధానంతో తమను చంద్రబాబు ప్రభుత్వం అవమానిస్తోందని కోపగించుకున్న ఉపాధ్యాయులు సార్వత్రిక ఎన్నికల్లో దాని ప్రభావాన్ని చూపారని తెలిపారు. ఇదే విధంగా సీఎం జగన్‌ ప్రవేశపెట్టిన అటెండెన్స్‌ యాప్‌ విధానం విస్మయం కలిగిస్తోందని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అనుభవజ్ఞుడని, ఆయన ఉపాధ్యాయుల సమస్యలను చక్కగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని వివరించారు. ఆయన్ను కూడా ప్రభుత్వ పెద్దలు ఉత్సవ విగ్రహంలా చూస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ ప్రసంగాలకు తెలుగు అనువాదకురాలిగా పురందేశ్వరి ఉన్నారని.. అలాగే ముఖ్యమంత్రి తెలుగును తెలుగులోకి అనువదించేందుకు ఓ అనువాదకుణ్ని నియమించుకోవాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలుగు భాషను సీఎం ఖూనీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని