ఏటీసీ టైర్ల పరిశ్రమను తెచ్చింది మేమే

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వేసే జె-ట్యాక్స్‌ దెబ్బకు ఉన్న పరిశ్రమలే పారిపోగా, కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకూ ఎవరూ ముందుకు రావడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏదైనా

Published : 18 Aug 2022 05:19 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వేసే జె-ట్యాక్స్‌ దెబ్బకు ఉన్న పరిశ్రమలే పారిపోగా, కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకూ ఎవరూ ముందుకు రావడం లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఏదైనా కంపెనీ పెట్టాలంటే ముందుగా కమీషన్లు తీసుకుని తాడేపల్లి ప్యాలెస్‌కి వెళ్లాల్సి వస్తోందన్నారు. ‘పెరిగిన పన్నులు, జె-ట్యాక్స్‌ దెబ్బకు ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. మూడేళ్లలో జగన్‌రెడ్డి విదేశాల నుంచి తెచ్చిన పెట్టుబడుల కంటే, తన విదేశీ పర్యటనలకు చేసిన ఖర్చే ఎక్కువ. తెదేపా హయాంలో ఒప్పందాలు కుదిరిన పరిశ్రమలకు జగన్‌రెడ్డి శంకుస్థాపనలు చేసి, అది తన ఘనతగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. ఏటీసీ టైర్ల పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపి, విశాఖకు వచ్చేందుకు ఒప్పించింది తెదేపా ప్రభుత్వమే. జగన్‌రెడ్డి తానే తెచ్చినట్టు ఫోజు కొడుతున్నారు. చిత్తూరు జిల్లా చినపాండూరులో రూ.1,800 కోట్లతో అపోలో టైర్స్‌ పరిశ్రమ ఏర్పాటుకు 2018లోనే ఒప్పందం జరిగింది. 2020 జూన్‌ 26న ఉత్పత్తి ప్రారంభించింది. జగన్‌రెడ్డి ఆ పరిశ్రమనూ తానే తెచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు’’ అని అచ్చెన్నాయుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘2018 సంవత్సరానికి సంబంధించిన స్టార్టప్‌ ర్యాంకింగ్స్‌లో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిస్తే.. 2020-21 ర్యాంకింగ్స్‌లో చిట్టచివరన బిహార్‌ సరసన చేరింది. ఎంఎస్‌ఎంఈలకు ఆగస్టులో పారిశ్రామిక రాయితీలిస్తామని వైకాపా క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’’ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

ధాన్యం బస్తాపై రూ.200 కమీషన్‌

రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలు వైకాపా నేతలకు ఏటీఎంలుగా మారాయని, ఒక్కో ధాన్యం బస్తాపై రూ. 200 వరకు కమీషన్‌ గుంజుతున్నారని అచ్చెన్నాయుడు ట్విటర్‌లో ధ్వజమెత్తారు. ‘నకిలీ రైతుల్ని నమోదు చేసి ధాన్యం కొనుగోళ్లలో ఒక్క రబీలోనే వందల కోట్ల సొమ్ము కాజేశారు. వైకాపా పాలనకు మించిన విపత్తు రాష్ట్రానికి మరొకటి లేదు’’ అని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులు, పంట దిగుబడులు, ఆర్బీకేల ద్వారా కొన్న ధాన్యం, రైతులకు బకాయిలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని