అప్పుడు మెప్పులు.. ఇప్పుడు తప్పులా?

తెలంగాణ వరదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని,  పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన నిజాలను ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెతారు. గతంలో ప్రాజెక్టు అద్భుతమని మెచ్చుకున్న కేంద్రమంత్రి షెకావత్‌

Updated : 19 Aug 2022 04:20 IST

కాళేశ్వరంపై షెకావత్‌వి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు

పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే: మంత్రి హరీశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ వరదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై భాజపా దుష్ప్రచారం చేస్తోందని,  పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిన నిజాలను ఇప్పుడు అబద్ధాలుగా ప్రచారం చేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెతారు. గతంలో ప్రాజెక్టు అద్భుతమని మెచ్చుకున్న కేంద్రమంత్రి షెకావత్‌ ఇప్పుడు రాజకీయ ద్వేషంతో బాధ్యతారహితంగా పుచ్చిపోయిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర నిజస్వరూపాన్ని సీఎం కేసీఆర్‌ ఎండగడుతుంటే భాజపా నేతలకు కడుపుమంటగా ఉందన్నారు. గతంలో డీపీఆర్‌తో పాటు అన్ని విషయాలను పరిశీలించాకే అనుమతులు ఇచ్చారన్నారు. వారికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్‌ అద్భుతంగా పని చేశారని మోదీ పార్లమెంట్‌లో మెచ్చుకున్నారన్నారు. ఈ ప్రాజెక్టుకు తానే అనుమతి ఇచ్చానని, అది తెలంగాణకు గ్రోత్‌ ఇంజిన్‌ అయిందని గడ్కరీ చెప్పారన్నారు. సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ మసూద్‌ హుస్సేన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రాజీవ్‌శర్మలు కూడా ప్రశంసించారన్నారు. మంత్రి హరీశ్‌రావు గురువారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్‌, మాణిక్‌రావు, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాత మధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మొత్తంగా 3 బ్యారేజీలు, 16 జలాశయాలు, 21 పంప్‌హౌస్‌లు, 98 కిలోమీటర్ల డెలివరీ పైపులు, 203 కిలోమీటర్ల సొరంగాలు, భారీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఇలా వందలాది కాంపోనెంట్లు ఉన్న కాళేశ్వరంలో కేవలం 2 పంప్‌హౌస్‌లు మునిగితే మొత్తం ప్రాజెక్టే నీట మునిగిందని గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మునిగిన పంపులను పునరుద్ధరించే బాధ్యత పూర్తిగా నిర్మాణసంస్థదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా పడే భారం ఏమీ లేదన్నారు. సెప్టెంబరు నెలాఖరు నాటికి కాళేశ్వరం పంప్‌హౌస్‌ను పునరుద్ధరించి నీటిని ఎత్తిపోస్తామని చెప్పారు.

ప్రకృతి వైపరీత్యం వల్లనే...

‘‘గోదావరికి 1986లో అత్యధికంగా 107.05 మీటర్ల మేర వరద వచ్చింది. ఈ మట్టాన్ని పరిగణనలోకి తీసుకునే మేడిగడ్డ బ్యారేజీ, కరకట్టలు పంప్‌హౌస్‌ రెగ్యులేటర్ల నిర్మాణం జరిగింది. ఈ ఏడాది గోదావరి వరద మట్టం 108.2 మీటర్లుగా నమోదైంది. ఈ అసాధారణ వరద వల్లే పంప్‌హౌస్‌ల రెగ్యులేటర్‌ గేట్ల రబ్బర్‌ సీల్స్‌ ఊడిపోయి బే లోకి పెద్దఎత్తున నీళ్లు వచ్చాయి. పంప్‌హౌస్‌తో పాటు 220 కేవీ సబ్‌స్టేషన్‌కు విద్యుత్‌ సరఫరా చేసే విద్యుత్‌టవర్లు కూడా కూలిపోయాయి. చందనాపూర్‌ వాగు అన్నారం బ్యారేజీ రక్షణ కోసం నిర్మించిన కరకట్టపై నుంచి పొంగిపొర్లడంతో ఆ పంప్‌హౌస్‌ మునిగింది. అయినా అది సురక్షితంగా ఉంది. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో బిగించిన 17 పంపుల్లో 3 మాత్రమే దెబ్బతిన్నాయి. పంప్‌హౌస్‌కు కరెంటు సరఫరా లేకపోవడంతో ఇంజినీర్లు ఫోర్‌బేలో నీటిని తోడేయలేకపోయారు.. దాంతో రక్షణ గోడపై ఒత్తిడి పెరిగి కొంత భాగం కూలిపోయింది. పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు పంప్‌హౌస్‌లు తప్ప అన్నీ ఇప్పుడు కూడా పని చేస్తున్నాయి. ఇప్పటికే 31 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రబీకి సిద్ధంగా ఉంచాం. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులిచ్చింది. కాస్ట్‌ బెనిఫిట్‌ రేషియోలో కూడా 2018లో అనుమతి  వచ్చింది. సాంకేతిక అనుమతి కూడా లభించింది. సామర్థ్యంలేని కంపెనీకి కాళేశ్వరం పనులు ఇచ్చారని కేంద్రమంత్రిగా ఉండి ఎలా మాట్లాడతారు? ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన వాళ్లే జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కడుతున్నారు. సామర్థ్యం లేకుంటే ఆ సంస్థకు ఆ ప్రాజెక్టు బాధ్యత ఎలా ఇచ్చారు? గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ఆ సంస్థ పని చేస్తోంది.


భాజపా ఆశలు అడియాసలే..

ప్రాజెక్టులు పాడు కావాలి.. తెలంగాణ బాగుపడొద్దు అనేది భాజపా దుష్టబుద్ధి. పంప్‌హౌస్‌లు మునిగాయని రాక్షసానందం పొందుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మూతపడాలనుకుంటున్న భాజపా ఆశలు అడియాసలు కాక తప్పవు. ఈ ప్రాజెక్టు కింద ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని అంటున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే మార్చి 4న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లకోసం మోటార్లను ఆన్‌ చేయడం వాస్తవం కాదా?  రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 200% పెరిగింది. పంట ఉత్పత్తి గతంలో కన్నా 200 శాతం పెరిగింది. పోయిన యాసంగిలో 11 లక్షల ఎకరాలకు మేలు జరిగింది’’ అని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుపై వివిధ సందర్భాల్లో నరేంద్రమోదీ, గడ్కరీ, మసూద్‌ హుస్సేన్‌, రాజీవ్‌శర్మలు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని