గాలం.. ఆపై బేరం

మునుగోడు రాజకీయం రంగులు మారుతోంది... నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెరాస, భాజపాలు పోటాపోటీగా ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది.

Published : 19 Aug 2022 04:18 IST

మునుగోడులో జోరందుకున్న ఫిరాయింపులు

కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులకు భారీ ఆఫర్లు

తెరాస అసంతృప్తులపై భాజపా నజర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు రాజకీయం రంగులు మారుతోంది... నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులను తమ పార్టీలో చేర్చుకునేందుకు తెరాస, భాజపాలు పోటాపోటీగా ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. అమిత్‌షా సభ నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్‌ అసంతృప్తులపై భాజపా దృష్టి సారించింది. తెరాస గత రెండు రోజులుగా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో సంప్రదింపులను ముమ్మరం చేసింది. ఇప్పటికే కొందరు కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులు, ఆ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు తెరాస, భాజపాల బాటపట్టారు. ఉదయం ఒక పార్టీ సమావేశంలో పాల్గొన్న నేతలు మధ్యాహ్నం మరో పార్టీలో చేరుతుండటం వంటి పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు డిమాండ్‌

మునుగోడు నియోజకవర్గంలో తెరాసకు అత్యధికంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. తర్వాతి స్థానంలో కాంగ్రెస్‌ ఉంది. 71 ఎంపీటీసీ స్థానాలకు గాను గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస 38 చోట్ల, కాంగ్రెస్‌ 32 చోట్ల నెగ్గింది. 159 గ్రామ పంచాయతీలకుగాను 88 చోట్ల తెరాస, 57 చోట్ల కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలిచారు. కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యుల్లో పది మంది గతంలోనే పార్టీ మారిపోగా మిగిలిన వారిని చేర్చుకునేందుకు తెరాస, భాజపాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల కుటుంబాల్లో కీలకంగా ఉన్న వారిని చేర్చుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. చండూరు పురపాలికలోని పదివార్డుల్లో ఏడింటిని దక్కించుకుని కాంగ్రెస్‌ ఛైర్‌పర్సన్‌ పదవిని హస్తగతం చేసుకుంది. అయితే ఛైర్‌పర్సన్‌ తెరాసలో చేరిపోవడంతో అది కాంగ్రెస్‌ చేజారింది. చండూరు మండలంలో కాంగ్రెస్‌ తరఫున అయిదుగురు ఎంపీటీసీ సభ్యులు నెగ్గగా ఇప్పటికే నలుగురు రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పలువురు తెరాసలో చేరారు. మరికొందరు పార్టీ మారే బాటపట్టారు.

తెరాసలోకి కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు

మర్రిగూడెం మండలానికి చెందిన వైస్‌ ఎంపీపీ, లెంకలపల్లి, సారంపేట సర్పంచులు, సారంపల్లి ఎంపీటీసీ సభ్యుడు తెరాసలో చేరారు. నాంపల్లి మండల పెద్దాపురం, దేవత్‌పల్లి ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్‌ నుంచి తెరాసలో చేరారు. ఉదయం కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొని భాజపా, తెరాసలపై నిప్పులు చెరిగిన దేవత్‌పల్లి ఎంపీటీసీ భర్త సాయంత్రం తెరాసలో చేరడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు మండలం రావిగూడెం, కల్వలపల్లి సర్పంచ్‌లు, చొల్లేడు, జమస్తాన్‌పల్లి, కిష్టాపురం సర్పంచుల భర్తలు, కిష్టాపురం ఎంపీటీసీ తెరాసలో చేరారు. పులిపల్పుల, గుడిమల్కాపురం కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులు తెరాసలో చేరారు.

అసంతృప్త నేతలపై భాజపా నజర్‌

మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి గతంలో కాంగ్రెస్‌తో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతోపాటు తెరాస అసంతృప్త నేతలను భాజపాలో చేర్చుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి తెరాస టికెట్‌ దాదాపు ఖాయం కావడంతో తెరాస నాయకుడు కర్నాటి విద్యాసాగర్‌ అనుచరులుగా ఉన్న సర్పంచులు, సర్పంచుల కుటుంబసభ్యులు భాజపాలో చేరారు. ఇప్పటికే చౌటుప్పల్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి తెరాస నుంచి భాజపాలో చేరారు. తాజాగా చల్మెడ సర్పంచ్‌, చండూరు మండలం తుమ్మలపల్లి తెరాస సర్పంచ్‌ కుమారుడు, చండూరు మండలంలోని దోనిపాములు, నెర్మట తెరాస సర్పంచ్‌తో పాటు చోప్పవారిగూడెం సర్పంచ్‌ భర్త భాజపాలో చేరారు. తాజాగా వార్డు సభ్యులను, మాజీ ప్రజాప్రతినిధులను చేర్చుకునేందుకూ పార్టీలు పోటీపడుతున్నాయి. గట్టుప్పల్‌ మండలంలో కాంగ్రెస్‌, తెరాస మద్దతుదారులైన 8 మంది వార్డు సభ్యులు భాజపాలో చేరారు.


బంపర్‌ ఆఫర్లు

స్థానిక ప్రజాప్రతినిధులకు తెరాస, భాజపా నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయని చర్చ జరుగుతోంది. పార్టీ మారేందుకు కొందరికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆఫర్‌ ఇస్తుండటంతో పాటు రాజకీయ భవిష్యత్తుపై కూడా హామీలు ఇస్తున్నారు. కొందరికి మాత్రం డబ్బుతోపాటు ఇతర నజరానాలను ఎరగా వేస్తున్నారు. పదవీకాలం చివరి దశకు చేరుకుంటుండటంతో పాటు వివిధ కారణాలతో ప్రజాప్రతినిధులు పార్టీలు మారేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని