క్వారీ తవ్వకాలపై వైకాపాలో వర్గపోరు

పల్నాడు జిల్లా నడికూడి ముగ్గురాయి క్వారీ తవ్వకాల విషయమై గురువారం వైకాపాలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాచేపల్లి నగర పంచాయతీ

Published : 19 Aug 2022 04:26 IST

రెండు వర్గాల మధ్య ఘర్షణ

దాచేపల్లి (నారాయణపురం), న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా నడికూడి ముగ్గురాయి క్వారీ తవ్వకాల విషయమై గురువారం వైకాపాలో రెండు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధి నడికూడి తెల్లరాయి క్వారీ ప్రాంతంలో తన పేరుతో 2.20 ఎకరాల భూమిలో క్వారీ మంజూరైందని వైకాపా సీనియర్‌ నాయకుడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు మందపాటి రమేష్‌రెడ్డి ఆ ప్రదేశంలో గురువారం భూమి పూజ పెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న వడ్డెర సంఘీయులు అక్కడికి వెళ్లి అభ్యంతరం చెప్పడంతో వివాదం చోటుచేసుకుంది. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ దేవెళ్ల రేవతి, ఆమె భర్త రాఘవ సంఘటన స్థలానికి వెళ్లగా, వాగ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో రేవతి కిందపడ్డారు. తనను కొట్టి నెట్టడంతో కిందపడ్డానని, రమేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రేవతి అక్కడే బైఠాయించారు. పార్టీ కార్యకర్తలు కూడా పెద్దఎత్తున మోహరించారు. సీఐ షేక్‌ బిలాలుద్దీన్‌, ఎస్సైలు షేక్‌ రహంతుల్లా, శివనాగరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రేవతి, రమేష్‌రెడ్డిలను పోలీసులు, పార్టీ నాయకులు సముదాయించి అక్కడి నుంచి పంపించారు.

నడిరోడ్డుపై ధర్నా.. స్తంభించిన ట్రాఫిక్‌

తరువాత రేవతి నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు రమేష్‌రెడ్డిని స్టేషన్‌కు పిలిపించకపోవడంతో ఆమె తంగెడ రోడ్డు వద్దకు వెళ్లి ధర్నా చేశారు. రమేష్‌రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండు చేశారు. రాతపూర్వకంగా ఇవ్వాలని సీఐ బిలాలుద్దీన్‌ కోరగా, ఆమె అక్కడే రాసిచ్చారు. గంటపాటు ఆందోళన చేయడంతో ప్రధాన రహదారికి రెండు వైపులా ట్రాఫిక్‌ స్తంభించింది.  ఇరువర్గాల ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు. రమేష్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు అతనికి అండగా ఉన్నారని రేవతి ఆరోపించారు. రమేష్‌రెడ్డి, ఆయన అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తన క్వారీలోకి దేవెళ్ల రేవతి, ఆమె భర్త రాఘవ వచ్చి దౌర్జన్యం చేసి బెదిరించారని రమేష్‌రెడ్డి ఆరోపించారు. తనతోపాటు వడ్డెర కార్మికులపై దాడి చేసిన రమేష్‌రెడ్డి, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలంటూ గురువారం రాత్రి నారాయణపురం బంగ్లా వద్ద రేవతి మౌన దీక్షకు కూర్చున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని