జగన్‌ కళ్లలో ఆనందం చూడాలనే..: వర్ల రామయ్య

జగన్‌ కళ్లలో ఆనందం చూడటానికి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మాధవ్‌ వీడియోపై సమగ్ర విచారణ జరిపితే.. కేసును నీరుగార్చేందుకు

Updated : 19 Aug 2022 09:45 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: జగన్‌ కళ్లలో ఆనందం చూడటానికి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ ప్రయత్నిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. మాధవ్‌ వీడియోపై సమగ్ర విచారణ జరిపితే.. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న సునీల్‌కుమార్‌, అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప సహా దీంతో సంబంధం ఉన్నవారంతా జైలుకు వెళ్తారని గురువారం ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ‘ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మాధవ్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేయలేమని పోలీసులు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఓ విదేశీ ఏజెన్సీని ఎలా సంప్రదించారు? విలేకరులకు ఇచ్చిన ఈ మెయిల్‌ కాపీలో ఎక్కడా ఆ నివేదిక అవాస్తవమని జిమ్‌స్టాఫర్డ్‌ చెప్పలేదు. ఎవరో మూడోవ్యక్తి రికార్డు చేశారని సునీల్‌కుమార్‌ చెబుతున్నారు. మొదటి వ్యక్తి వల్ల ఇబ్బందులు రావడంతో రెండో వ్యక్తి అయిన ఓ మహిళ.. మూడోవ్యక్తితో రికార్డు చేయించి దాన్ని విడుదల చేయించారు. న్యాయమూర్తులను తిట్టినవారిని ఏడాదిన్నరగా విదేశాల నుంచి తీసుకురాలేని అసమర్థ అధికారి సునీల్‌కుమార్‌.. ఈ వ్యవహారంపై ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో చెప్పాలి’ అని పేర్కొన్నారు.

పోలీసులది రోజుకో డ్రామా: బోండా ఉమామహేశ్వరరావు

గోరంట్ల మాధవ్‌ వీడియో వ్యవహారంలో పోలీసులు రోజుకో డ్రామా ఆడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ‘ఈ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు హోంమంత్రి తానేటి వనిత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. కానీ అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మీడియా సమావేశం పెట్టి, ఆ వీడియో అసలుది కాదని.. దాన్ని ల్యాబ్‌కు పంపలేదని చెప్పారు. అసలు వీడియోను కనిపెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ అమెరికాలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన నివేదిక తప్పని చెబుతున్నారు. పోలీసులు, సీఐడీ అధికారులు మాధవ్‌ను కాపాడాలని ప్రయత్నిస్తున్నారు. దేశంలోని ఏదో ఒక ప్రయోగశాలకు పంపి ఈ వీడియోను పరీక్షించండి’ అని ఆయన డిమాండు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని