పలాసలో ఉత్కంఠ!

వైకాపా, తెదేపా నేతల మధ్య సవాళ్లతో శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్ది నెలలుగా భూకబ్జాలు భూముల ఆక్రమణలపై ఒకరిపై ఒకరు

Updated : 21 Aug 2022 07:06 IST

తెదేపా కార్యాలయాన్ని  ముట్టడిస్తాం: వైకాపా

ఎలా చేస్తారో చూస్తాం: తెదేపా

నేడు పరామర్శకు రానున్న లోకేశ్‌

పలాస, కాశీబుగ్గ, న్యూస్‌టుడే: వైకాపా, తెదేపా నేతల మధ్య సవాళ్లతో శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్ది నెలలుగా భూకబ్జాలు భూముల ఆక్రమణలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ సవాల్‌ విసురుకుంటుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గురువారం రాత్రి చెరువులో ఆక్రమించి నిర్మించారంటూ 27వ వార్డు కౌన్సిలర్‌, తెదేపాకు చెందిన సూర్యనారాయణ ఇళ్లను కూలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించడం, దానిని తెదేపా వారు అడ్డుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మరోవైపు సీదిరి అప్పలరాజుపై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష వ్యక్తిగత దూషణలు, అనుచిత వాఖ్యలు చేస్తున్నారని, ఆమె ఈ నెల 18వ తేదీలోగా క్షమాపణ చెప్పకపోతే 21న తెదేపా కార్యాలయాన్ని ముట్టడిస్తామంటూ వైకాపా నాయకులు హెచ్చరించారు. ఆమె స్పందించకపోవడంతో వైకాపా నాయకులు ఆదివారం ఉదయం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించి తెదేపా కార్యాలయాన్ని ముట్టడించేందుకు జనసమీకరణ చేస్తున్నారు. ప్రతిగా తాము పార్టీ కార్యాలయంలోనే ఉంటామని ఎలా ముట్టడిస్తారో చూస్తామని గౌతు శిరీష పేర్కొన్నారు. ముట్టడిని ఎదుర్కొనేందుకు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు చేరుకోవాలని కోరారు. అలాగే ఆదివారం తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తమ పార్టీకి చెందిన కౌన్సిలర్‌ సూర్యనారాయణను పరామర్శించేందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో శనివారం జిల్లాకు చెందిన అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, విఠలేశ్వరరావు, డీఎస్పీలు మహేంద్ర, బాలరాజు, ఇతర పోలీస్‌ అధికారులు పరిస్థితిని సమీక్షించారు. భారీ స్థాయిలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని