Nitin Gadkari: వాజ్‌పేయీ, ఆడ్వాణీల వల్లే ఇప్పుడు అధికారంలో ఉన్నాం: గడ్కరీ

ఇటీవలే భాజపా పార్లమెంటరీ బోర్డులో చోటు కోల్పోయిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌.కె.ఆడ్వాణీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వంటి అగ్ర నే

Updated : 22 Aug 2022 06:57 IST

నాగ్‌పుర్‌: ఇటీవలే భాజపా పార్లమెంటరీ బోర్డులో చోటు కోల్పోయిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, ఎల్‌.కె.ఆడ్వాణీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ వంటి అగ్ర నేతల కృషి వల్లే భాజపా కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. నాగ్‌పుర్‌లో ఆదివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1980లో భాజపా ముంబయిలో నిర్వహించిన సదస్సులో వాజ్‌పేయీ చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘ఏదో ఒకరోజు చీకటి తొలగిపోతుంది. సూర్యుడు బయటికొస్తాడు. కమలం వికసిస్తుంది’’ అని అటల్‌ జీ ఆ రోజు వ్యాఖ్యానించారన్నారు. ‘‘ఆ సదస్సులో నేను ఉన్నాను. నాడు వాజ్‌పేయీ ప్రసంగాన్ని విన్నవారంతా అలాంటి ఒకరోజు వస్తుందని విశ్వసించారు. అటల్‌, ఆడ్వాణీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, ఇంకా మరెందరో కార్యకర్తలు విశేషంగా కృషిచేయడం వల్లే మనం ఇప్పుడు మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్నాం’’ అని గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారమే కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నతీరుపై కూడా ఆయన స్పందించారు. ఆరెస్సెస్‌ సిద్ధాంతకర్త దివంగత దత్తోపంత్‌ ఠెంగడీ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘‘రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించే ఆలోచిస్తారు. దేశాన్ని, సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజ-ఆర్థిక సంస్కర్తలు మాత్రం చాలా ముందుచూపుతో వచ్చే శతాబ్దం గురించి కూడా ఆలోచిస్తారు. ఈ విషయాన్ని ఠెంగడీ పదేపదే చెబుతుండేవారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని