కొవ్వూరు అర్బన్‌ బ్యాంకులో హైడ్రామా

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ప్రాంగణం శుక్రవారం రణరంగాన్ని తలపించింది. ఈ బ్యాంకు పాలకవర్గంలోని 11 స్థానాలకూ జులై 25న తెదేపా

Published : 27 Aug 2022 04:43 IST

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు ప్రాంగణం శుక్రవారం రణరంగాన్ని తలపించింది. ఈ బ్యాంకు పాలకవర్గంలోని 11 స్థానాలకూ జులై 25న తెదేపా మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది హోంమంత్రి తానేటి వనిత నియోజకవర్గం కావడంతో రాజకీయంగా వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియను రహస్యంగా నిర్వహించారని వైకాపా, నిబంధనల ప్రకారమే జరిగాయని తెదేపా నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. అనూహ్యంగా నెల రోజుల తర్వాత ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈమేరకు బాధ్యతల స్వీకరణకు శుక్రవారం ఉదయం 10 గంటలకు త్రిసభ్య కమిటీ సభ్యులు, వైకాపా నాయకులు బ్యాంకుకు వచ్చారు. బ్యాంకు ప్రధాన గేటు మూసేసి, భారీగా పోలీసులను మోహరించారు. బ్యాంకు సీఈవో ఆకుల భాస్కర్‌ సమక్షంలో ఛైర్‌పర్సన్‌గా ఇమ్మణ్ణి వీరశంకరం, సభ్యులుగా బత్తి నాగరాజు, గాడి విజయ రాజ్‌కుమార్‌లు మినిట్స్‌ పుస్తకంలో సంతకాలు చేశారు. విషయం తెలిసి పలువురు బ్యాంకు డైరెక్టర్లు, డిపాజిటర్లు, తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బ్యాంకు వద్దకు తరలివచ్చారు. తమలో నుంచి కనీసం నలుగురినైనా లోపలికి అనుమతించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు చూపించాలని తెదేపా నేతలు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల సురేష్‌లు డిమాండ్‌ చేశారు. ఒకానొక దశలో పోలీసులు, తెదేపా నేతల తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ క్రమంలోనే మద్దిపట్ల సురేష్‌ను గ్రామీణ ఎస్సై జి.సతీష్‌ కాలితో తన్నారని తెదేపా నాయకులు ఆందోళన చేశారు. గొడవ పెద్దదవుతుండటంతో ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్యాంకు పాలకవర్గం అధ్యక్షుడి గదికి తాళం వేసి ఉండటం, దాని తాళం చెవి లేకపోవడంతో సహకార అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ బెజవాడ శ్రీనివాస్‌, వీఆర్వోల సమక్షంలో దాన్ని తెరిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని