Munugode bypoll: మిషన్‌ మునుగోడు

ఉప ఎన్నికలో గెలుపు ప్రణాళిక రూపకల్పన, పార్టీలో విభేదాల కట్టడి, వచ్చే శాసనసభ సమావేశాల కోసం సన్నద్ధత తదితర లక్ష్యాలతో వచ్చే నెల 3న తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో

Published : 01 Sep 2022 03:31 IST

ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యం

పార్టీ నేతల మధ్య విభేదాల కట్టడి

శాసనసభలో ఎదురుదాడి వ్యూహం 

3న తెరాస శాసనసభాపక్ష సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఉప ఎన్నికలో గెలుపు ప్రణాళిక రూపకల్పన, పార్టీలో విభేదాల కట్టడి, వచ్చే శాసనసభ సమావేశాల కోసం సన్నద్ధత తదితర లక్ష్యాలతో వచ్చే నెల 3న తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో పార్టీ శాసన సభాపక్ష సమావేశం జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తర్వాత సీఎం బహిరంగంగా నిర్వహిస్తున్న పార్టీ మొదటి సమావేశమిదే. ఈ ఉప ఎన్నికను కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. మిగిలిన పార్టీల కంటే ముందే భారీ సభను నిర్వహించారు. ‘ఇది తెలంగాణ బతుకుదెరువు ఎన్నిక’ అని సభలోనే చెప్పారు. ఈ ఎన్నికలో గెలిచి కేంద్రానికి సత్తా చాటాలని, మరింత ఉత్సాహంతో వచ్చే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి ప్రచార వ్యూహం, ఎన్నికల కార్యాచరణ కోసం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను ప్రచారంలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. గ్రామానికో కీలక ప్రజాప్రతినిధిని పర్యవేక్షకునిగా నియమించాలనే ఆలోచనా ఉన్నట్టు సమాచారం. ‘‘ఇందులో భాగంగానే వచ్చే నెల రెండో వారంలో చండూరులో సీఎం పర్యటించనున్నారు. ఆ తర్వాత మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ఇతర ముఖ్యనేతల సభలు, సమావేశాలు మునుగోడులో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారం తదితర అంశాలకు సంబంధించిన వూహ్యంపై శాసన సభాపక్ష సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేస్తారు’’ అని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

విభేదాలపై చర్చ

పలు జిల్లాలు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. ఒక వర్గంపై మరో వర్గం దాడులకు పాల్పడుతోంది. ఉదాహరణకు తాండూరు, వికారాబాద్‌లలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లకు మధ్య విభేదాలున్నాయి. కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలపై జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, పురపాలక ఛైర్మన్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. పార్టీకి నష్టం కల్గించే ఇలాంటి పరిణామాలపై అధినేత ఆగ్రహంతో ఉన్నారు. శాసనసభాపక్ష సమావేశంలో వీటన్నింటిపై చర్చించి ఐక్యతతో వెళ్లాలంటూ నేతలకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. అలాగే జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించేలా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశాన్నీ సీఎం ప్రస్తావించనున్నారు.

* వచ్చే నెల 26లోపు శాసనసభా సమావేశాలు జరగనున్నాయి. తెలంగాణపై కేంద్రం వివక్ష, మునుగోడు ఉప ఎన్నికలు, రాష్ట్రంలో విపక్షాల దూకుడు దృష్ట్యా శాసనసభ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సభ వేదికగా కేంద్రంపై ఎదురుదాడికి అనుసరించాల్సిన వైఖరిని సీఎం వివరించే అవకాశం ఉంది.

* కొత్తగా 57 ఏళ్ల వారికి ఇస్తున్న పింఛన్లపై లబ్ధిదారుల స్పందన తెలుసుకుని కొత్తగా మరో రెండు లక్షలు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

* పోడు  సమస్య పరిష్కారానికి అనుసరించాల్సిన విధానంపైనా సీఎం నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని