ఎన్టీఆర్‌ పేరు మార్పు అనాగరికం

ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 16 తెదేపా హయాంలో వచ్చినవే. వాస్తవాలు ఇలా ఉంటే జగన్‌ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. నేనసలు కాలేజీలే ఏర్పాటు చేయలేదట. జగన్‌ ప్రభుత్వం

Updated : 23 Sep 2022 04:17 IST

చేతనైతే మరో యూనివర్సిటీ ఏర్పాటుచేసి మీ తండ్రిపేరు పెట్టుకోండి

గవర్నర్‌కు మాట మాత్రంగానైనా చెప్పలేదు

తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం

పేరు మార్పుపై గవర్నర్‌కు ఫిర్యాదు

ఏపీలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 16 తెదేపా హయాంలో వచ్చినవే. వాస్తవాలు ఇలా ఉంటే జగన్‌ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారు. నేనసలు కాలేజీలే ఏర్పాటు చేయలేదట. జగన్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన వైద్య కళాశాలల్లో మూడింటికే ఇప్పటివరకు గుర్తింపు వచ్చింది. రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక ఎయిమ్స్‌ వస్తే.. తెదేపా ప్రభుత్వం 197 ఎకరాల భూమి ఇచ్చింది. రెండు పక్కలా దారిచ్చాం. జగన్‌ ప్రభుత్వం ఎయిమ్స్‌కు కనీసం నీళ్లు ఇవ్వలేదు. అలాంటి వీళ్లా... వైద్య విద్య గురించి మాట్లాడుతోంది.

- చంద్రబాబు


ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తీసేసి వైఎస్సార్‌ పేరు పెట్టడం అనాగరిక, పనికిమాలిన చర్యని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాత్రికి రాత్రి మంత్రులకు నోట్‌ పంపి, వారి ఆమోదంతో అసెంబ్లీలో చీకటి బిల్లు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన మండిపడ్డారు. ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించడంపై చంద్రబాబు ఆధ్వర్యంలో తెదేపా నేతల బృందం గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం రాజ్‌భవన్‌ వెలుపల చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు.

‘ముఖ్యమంత్రి జగన్‌ నోరు తెరిస్తే అబద్ధాలే. అసెంబ్లీలో అంత యథేచ్ఛగా అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు మార్చడం రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు. అసలు ఈ ముఖ్యమంత్రికి ఎన్టీఆర్‌ పేరు తీసేందుకు మనసెలా వచ్చింది? పైగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు రాత్రంతా ఆలోచించానని చెబుతున్నారు. ఎవరితో మాట్లాడారు? తెలుగు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవంగా ఉన్న ఎన్టీఆర్‌ పేరు మార్చేయడానికి ఈ ముఖ్యమంత్రికి ఎంత ధైర్యం ఉండాలి? ప్రతి వ్యక్తీ ఎన్టీఆర్‌లో ఒక రాముడిని, కృష్ణుడిని చూసుకుని ఆరాధించారు. అలాంటి ఎన్టీఆర్‌కు, వైఎస్సార్‌కు పోలికా? ఏ విషయంలో పోలిక ఉంది? వయసులోనా, సమాజానికి చేసిన సేవల్లోనా? జీవితంలోనా? ఎన్టీఆర్‌ కంటే రాజశేఖరరెడ్డి గొప్పని సీఎం చెబుతున్నారు. సిగ్గుండాలి. ఇది ఎన్టీఆర్‌ శత జయంతి సంవత్సరం. అలాంటి సమయంలో యూనివర్సిటీకి ఆయన పేరు తీసేయడమేంటి? మీకు చేతనైతే మరో యూనివర్సిటీ ఏర్పాటుచేసి దానికి మీ నాన్న పేరు పెట్టుకోండి’ అని ఆయన మండిపడ్డారు. జగన్‌ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆయన సొంత చెల్లెలు షర్మిలే వ్యతిరేకించారని అన్నారు.

వైద్య రంగానికి ఎన్టీఆర్‌ చేసిన సేవ కనిపించలేదా?

‘ఎన్టీఆర్‌ హయాంలోనే ప్రభుత్వం విజయవాడలోని సిద్దార్థ వైద్య కళాశాలను స్వాధీనం చేసుకుని వైద్య విశ్వవిద్యాలయంగా మార్చింది. రాష్ట్రంలో వైద్య కళాశాలలన్నింటినీ ఒకే గొడుగు   కిందకు తెచ్చేందుకు ఆయన 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి కాకర్ల సుబ్బారావును తీసుకొచ్చి, నిమ్స్‌కు డైరెక్టర్‌ను చేసి.. దానిని తీర్చిదిద్దారు. వైద్య రంగానికి ఎన్టీఆర్‌ చేసిన అపారమైన కృషిని ఎప్పటికీ మర్చిపోలేం. అందుకే హెల్త్‌ యూనివర్సిటీకి 1998లో ఆయన పేరుపెట్టాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఎయిమ్స్‌కు నీళ్లు ఇవ్వలేరుగానీ..

‘నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో వైద్య కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ వచ్చేలా ఏర్పాట్లు చేశాం.. మీ తండ్రి 2004 నుంచి 2009 వరకు, మీరు 2019 నుంచి 2022 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ హయాంలో ఎన్ని వైద్యకళాశాలలు వచ్చాయో ఈ జాబితా చూడండి. చదువు రాకపోతే చదివించుకోండి’ అని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మేం చెబితేనే గవర్నర్‌కు తెలిసింది

గవర్నర్‌ కులపతిగా ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి... కనీసం ఆయనకు మాటమాత్రంగానైనా చెప్పకుండా పేరు మార్చేయడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘యూనివర్సిటీ పేరు మారుస్తూ బిల్లు ఆమోదించారా?’ అని గవర్నర్‌ తమను ప్రశ్నించినట్టు చెప్పారు.

ఎన్టీఆర్‌ పేరు పెట్టేదాకా వదలం

ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెట్టేదాకా వదలబోమని చంద్రబాబు తెలిపారు. ‘ఈ విషయాన్ని కేంద్రం, యూజీసీ, ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళతాం. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. అన్ని పార్టీలూ ఎన్టీఆర్‌ పేరు తొలగించడాన్ని    వ్యతిరేకిస్తున్నాయి. గతంలో ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన రూ.400 కోట్లను జగన్‌ దారి మళ్లించారు. భవిష్యత్తులో మొత్తం విశ్వవిద్యాలయాన్ని కబ్జా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజలూ ఈ విషయాన్ని గమనించాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. తెదేపా నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, పయ్యావుల కేశవ్‌, నక్కా ఆనంద్‌బాబు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, బెందాళం అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని