కుప్పంపై కాదు... పులివెందులపై దృష్టిపెట్టాలి

ముఖ్యమంత్రి అభివృద్ధి చేయాల్సింది ఇప్పటికే బాగున్న కుప్పాన్ని కాదని, తన సొంత నియోజకవర్గం పులివెందులనని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హితవు పలికారు. ఆయన శుక్రవారం

Updated : 24 Sep 2022 06:02 IST

ముఖ్యమంత్రికి ఎంపీ రఘురామ హితవు

ఈనాడు, దిల్లీ: ముఖ్యమంత్రి అభివృద్ధి చేయాల్సింది ఇప్పటికే బాగున్న కుప్పాన్ని కాదని, తన సొంత నియోజకవర్గం పులివెందులనని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హితవు పలికారు. ఆయన శుక్రవారం ఇక్కడ తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ‘పులివెందులలో ఇప్పటివరకూ కనీసం బస్టాండు కూడా లేదు. కడప జిల్లా కేంద్రంలో ఉన్న పాతబస్టాండ్‌ను బకాయిలు చెల్లించలేదన్న కారణంగా మున్సిపల్‌ కమిషనర్‌ బస్సులు రాకుండా గేట్లు మూసేశారు. అందువల్ల ముఖ్యమంత్రి అన్నింటికంటే ముందు పులివెందులలో బస్టాండ్‌ నిర్మాణం, జిల్లా కేంద్రంలో మూతపడిన బస్టాండ్‌ను తెరిపించేందుకు ప్రయత్నించాలి. పులివెందులకు ఏమీ చేయని ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కుప్పంలో రోడ్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కృషివల్ల బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు వాటిని తవ్వి మధ్యలో బ్యారికేడ్లు నిర్మించారు. గత రెండురోజులుగా అక్కడ పాఠశాలలను మూసేసి పాఠశాల బస్సులను లాగేసుకోవడంతోపాటు, రాష్ట్రం నలుమూలల నుంచి స్కూల్‌ బస్సుల్లో ప్రజలను తరలించారు’ అని రఘురామకృష్ణరాజు అన్నారు. వాట్సప్‌ గ్రూప్‌లో వచ్చిన సందేశాన్ని మరో గ్రూప్‌నకు ఫార్వర్డ్‌ చేసినందుకు సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబుపై కేసు నమోదుచేసి అరెస్ట్‌చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసేప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 41ఏ నోటీసు కచ్చితంగా ఇవ్వాలని, కానీ ఏపీ సీఐడీ పోలీసులు ఆ నిబంధనను పాటించలేదని విమర్శించారు. ఏపీ సీఐడీకి నేతృత్వం వహిస్తున్న సునీల్‌కుమార్‌ను తక్షణమే తప్పించాలని డీఓపీటీ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శులకు లేఖలు రాసినట్లు చెప్పారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts