‘చేయూత’ పేరుతో మోసం చేస్తున్న జగన్‌

చేయూత పేరుతో అక్కాచెల్లెమ్మలను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది డ్వాక్రా మహిళలుంటే 26 లక్షల

Published : 24 Sep 2022 05:52 IST

మాజీ మంత్రి పీతల సుజాత

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చేయూత పేరుతో అక్కాచెల్లెమ్మలను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది డ్వాక్రా మహిళలుంటే 26 లక్షల మందికే చేయూత పథకాన్ని వర్తింపజేశారని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అంగన్‌వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, ఫుడ్‌ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కృష్ణమ్మలతో కలిసి శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘మాయమాటలతో జగన్‌ సీఎం అయ్యారు. 300 యూనిట్లకు మించి విద్యుత్తు వినియోగించారని, సొంత వాహనం ఉందని ఇలా రకరకాల కారణాలతో లబ్ధిదారులను తొలగిస్తున్నారు. ఒక గ్రామంలో వంద మంది మహిళలు ఉంటే 20 మందికి మాత్రమే చేయూత సాయం అందుతోంది. జగన్‌కు ధైర్యం ఉంటే లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలి’’ అని సుజాత పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి చంద్రబాబు మహిళా సాధికారతకు బాటలు వేస్తే..వైకాపా ప్రభుత్వంలో అవి నిర్వీర్యమయ్యాయని ఆచంట సునీత విమర్శించారు. తెదేపా హయాంలో డ్వాక్రా మహిళలకు రూ.5 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలిస్తే..జగన్‌ వాటిని రూ.మూడు లక్షలకు కుదించారన్నారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్‌ మహిళలను మోసం చేశారని కృష్ణమ్మ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని