‘కుప్పం’ తెదేపా నేతలకు హైకోర్టులో ఊరట

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం తెదేపా నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. రామకుప్పం పోలీసులు తెదేపా నాయకులపై హత్యాయత్నం తదితర తీవ్ర సెక్షన్లు నమోదు చేసి

Published : 24 Sep 2022 05:52 IST

బెయిలు మంజూరు చేసిన న్యాయస్థానం

ఈనాడు, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం తెదేపా నేతలకు హైకోర్టులో ఊరట లభించింది. రామకుప్పం పోలీసులు తెదేపా నాయకులపై హత్యాయత్నం తదితర తీవ్ర సెక్షన్లు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన కేసులో షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. బెయిలు పొందిన వారిలో తెదేపా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మాజీ జడ్పీటీసీ ఎస్‌.రాజ్‌కుమార్‌, నాయకులు టి.మునస్వామి, మునెప్ప, మంజునాథ్‌, ఎం.సుబ్రమణ్యం(సుబ్బు), ముకేష్‌కుమార్‌, ఆర్‌.సుబ్రమణ్యం మణి ఉన్నారు. రూ.25 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు సంబంధిత స్టేషన్‌ హౌజ్‌ అధికారి ముందు నెలలో రెండు, నాలుగో శనివారం హాజరు కావాలని షరతు విధించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు వాదనలు వినిపించారు. రాజకీయకక్షతో పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా ఇటీవల రామకుప్పం మండలం కొల్లుపల్లి గ్రామంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ విషయమై రామకుప్పం పోలీసులు తెదేపా నేతలపై పలు కేసులు పెట్టి అరెస్ట్‌ చేశారు. ఆ కేసుల్లో తమకు బెయిలు మంజూరు చేయాలని తెదేపా నేతలు హైకోర్టులో బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని