‘పాయకరావుపేట’ వైకాపాలో విభేదాలు

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైకాపాలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యతిరేక వర్గానికి చెందిన ఎస్‌.రాయవరం ఎంపీపీ

Published : 24 Sep 2022 05:52 IST

ఎస్‌.రాయవరం ఎంపీపీ రాజీనామా

ఎమ్మెల్యే బాబూరావు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజం

ఎస్‌.రాయవరం, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ వైకాపాలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యతిరేక వర్గానికి చెందిన ఎస్‌.రాయవరం ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా పరిషత్తు సీఈఓ సత్యనారాయణకు ఆమె రాజీనామా లేఖ అందజేశారు. ఈ సందర్భంగా శారదాకుమారి విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రాదేశిక ఎన్నికల్లో ఎస్‌.రాయవరం మండలంలోని 21 సెగ్మెంట్లలో 17 చోట్ల వైకాపా అభ్యర్థులు గెలుపొందారు. వారందరి మద్దతుతో ఎంపీపీగా బాధ్యతలు చేపట్టా. నాటి నుంచే ఎమ్మెల్యే వైఖరిలో మార్పును గమనించాం. తిమ్మాపురం, గుడివాడ సర్పంచులను ఇబ్బందులకు గురి చేసి ఆర్థికంగా దెబ్బతీశారు. మా వల్ల ఎవరికీ ఏ కష్టం రాకూడదనే ఎంపీపీ పదవికి రాజీనామా చేశా. ఎంపీ విజయసాయిరెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కొద్దిరోజులు ఓపిక పట్టాలని గతంలో సూచించారు. ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా పదవిని త్యజించాల్సి వచ్చింది. ఎప్పటికీ వైఎస్‌ కుటుంబానికి విధేయులుగా ఉంటామని, వైకాపాలోనే కొనసాగుతా’మని స్పష్టం చేశారు. శారదాకుమారి భర్త, వైకాపా జిల్లా కోశాధికారి బొలిశెట్టి గోవిందరావు మాట్లాడుతూ ‘వైకాపా మద్దతు లేకపోతే ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వార్డు సభ్యుడిగానూ గెలవలేరు. డబ్బుకు ఇచ్చే ప్రాధాన్యత నాయకులు, కార్యకర్తలకు ఇవ్వడం లేదు. మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పదవి ఇచ్చేందుకు ఎమ్మెల్యే రూ.10 లక్షలు వసూలు చేశారు. పేట నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల నుంచి వసూళ్లు చేస్తున్నారు. లింగరాజుపాలెంలోని బీసీ గురుకుల పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి రూ.2 లక్షల చొప్పున వసూలు చేశారు’ అని గోవిందరావు ఆరోపించారు. ఎస్‌.రాయవరం సర్పంచి భూపతి అప్పారావు, ఎంపీటీసీ సభ్యుడు బైపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts