జగన్‌ ఏవైపు ఉంటారో తేల్చుకోవాలి

దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోదీవైపు ఉంటారో.. రాజ్యాంగాన్ని కాపాడేవైపు ఉంటారో సీఎం జగన్‌ తేల్చుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు. కేంద్రం నుంచి

Published : 25 Sep 2022 05:22 IST

దేశ సంపదను దోచిపెడుతున్న మోదీవైపా.. రాజ్యాంగాన్ని కాపాడేవైపా..

‘దేశ రక్షణ భేరి’లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

అడ్డగోలుగా వ్యవహరిస్తున్న సీఎం: వి.శ్రీనివాసరావు

ఈనాడు, అమరావతి: దేశాన్ని సర్వనాశనం చేస్తున్న మోదీవైపు ఉంటారో.. రాజ్యాంగాన్ని కాపాడేవైపు ఉంటారో సీఎం జగన్‌ తేల్చుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.36వేల కోట్ల బకాయిల కోసం కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయట్లేదని విమర్శించారు. విజయవాడలో శనివారం నిర్వహించిన ‘దేశ రక్షణ భేరి’ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ విభజన సమయంలో రాజ్యసభలో ఐదేళ్లు ప్రత్యేక హోదా కావాలని నేను అడిగితే అప్పటి ఎంపీ, మాజీ ఉపరాష్ట్రపతి తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికీ హోదాపై కేంద్రాన్ని వైకాపా అడగటం లేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని పార్టీలూ నిర్ణయం తీసుకోవాలి. దేశాన్ని కాపాడాలని, మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే నినాదంతో దేశవ్యాప్తంగా దేశ రక్షణ భేరి నిర్వహిస్తున్నాం. దేశం అన్ని రంగాల్లోనూ సంక్షోభంలో ఉంది. బ్యాంకుల నుంచి రూ.11లక్షల కోట్లు రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించని బడాబాబులకు వాటిని మోదీ మాఫీ చేశారు. గుజరాత్‌లో వేదాంత కంపెనీ గనుల తవ్వకాలకు రూ.80వేల కోట్ల రాయితీ ఇచ్చారు. దేశ ప్రజల కోసం రూ.73వేల కోట్లే ఖర్చు చేశారు’ అని విమర్శించారు.

‘దేశంలో లూటీ జరుగుతోంది. ప్రధాని మోదీ తన మిత్రులకు దోచి పెడుతున్నారు. మోదీ ప్రధాని కాకముందు ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ప్రపంచంలో రెండో స్థానానికి ఎలా వచ్చారు? ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కలిసి మోదీ ప్రభుత్వాన్ని దూరం పెట్టాలి. దిల్లీలో ఆదివారం బిహార్‌ ముఖ్యమంత్రి, ఇతర నేతలతో సమావేశం ఉంది. మోదీని గద్దె దించాలనే నినాదాన్ని అక్కడ వినిపిస్తాం. ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా కొందరిని డబ్బులు, అధికారంతో లొంగదీసుకుని భాజపానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకోవాలి’ అని పిలుపునిచ్చారు.

జగన్‌ తానే రాజు.. తానే మంత్రి: సీపీఎం కార్యదర్శి
సీఎం జగన్‌ తానే రాజు తానే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నారని, అందరిపైనా కేసులు పెట్టి, అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ‘ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ మరోపక్క విద్యుత్తు, బస్సు ఛార్జీల పెంపు, చెత్త పన్నులతో ప్రజల మాడు పగులగొడుతున్నారు. ఏపీని అదానీప్రదేశ్‌గా మార్చేశారు. సచివాలయాలతో జనాలపై పెత్తనం చేయడం పాలనా వికేంద్రీకరణ కాదు. స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వాలి. విధానాలు మార్చుకోకపోతే ప్రజలు ఛీత్కరిస్తారు. కొరియా, జపాన్‌, చైనాల్లో మాతృభాషలోనే విద్య కొనసాగుతోంది. ఇక్కడ ఆంగ్ల మాధ్యమం ఎందుకు? సంక్షేమ పథకాలకు బటన్‌ నొక్కి డబ్బులు వేసి, తర్వాత ఖాళీగా ఉండి వివాదాలు సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు. సభలో కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు, వై.వెంకటేశ్వరరావు, సుబ్బరావమ్మ, మంతెన సీతారాం, జమలయ్య, సీనియర్‌ నాయకుడు పి.మధు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని