ఇంటాబయటా నిరసన సెగలు

వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారి ప్రాంతాల్లోనే సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో పోలీసుల సాయంతో

Published : 25 Sep 2022 05:22 IST

పాయకరావుపేట, పెందుర్తి ఎమ్మెల్యేలపై అసమ్మతి నేతల ఆగ్రహం

తూర్పుగోదావరిలో రసాభాసగా ‘గడప గడపకూ మన ప్రభుత్వం’

ఎస్‌.రాయవరం, పెందుర్తి, దేవరపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు వారి ప్రాంతాల్లోనే సొంత పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో పోలీసుల సాయంతో ఆ నిరసనల నుంచి బయటపడ్డారు. శనివారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ నిరసన సెగ ఎదుర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెంలో జరిగిన ‘గడప గడపకూ...‘ కార్యక్రమంలో మహిళలు ఎంపీని నిలదీశారు. అనకాపల్లి జిల్లా గుడివాడలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వెళ్లగా.. సొంత పార్టీ నాయకులైన గుడివాడ సర్పంచి ధూళి శ్రీనుబాబు, వైస్‌ ఎంపీపీ అప్పలరాజు, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి, కాన్వాయ్‌కి అడ్డుగా బైఠాయించారు. దీంతో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కొద్దిసేపు వారిని నిలువరించడంతో ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసి వెనుదిరిగారు. ఘటనలో శ్రీనుబాబు, అప్పలరాజు అస్వస్థతకు గురయ్యారు. ప్రజాప్రతినిధులను ఇబ్బందులకు గురిచేస్తున్నాననడం దారుణమని ఎమ్మెల్యే అన్నారు. తప్పుడు కుల ధ్రువీకరణతో ఎంపీపీగా కొనసాగుతున్న శారదా కుమారి అనర్హత వేటు పడుతుందనే భయంతో శుక్రవారం పదవికి రాజీనామా చేసి, తనపై ఆరోపణలు చేస్తున్నారని బాబూరావు విమర్శించారు.

* పెందుర్తి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ విశాఖలోని 96వ వార్డులో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వెళ్లగా స్థానిక వైకాపా నాయకుడు శరగడం చినఅప్పలనాయుడు అనుచరులు నిరసనకు దిగారు. చినఅప్పలనాయుడును కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకోగా.. ఆ తోపులాటల మధ్యే ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. చినఅప్పలనాయుడు మాట్లాడుతూ.. తన ఇంటి సమీపంలోనే కార్యక్రమం జరుగుతున్నా తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. అంతా ప్రొటోకాల్‌ ప్రకారమే జరిగినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

* తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శనివారం ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై బహిరంగ సభ నిర్వహించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొంతమంది నాయకులు తారాజువ్వలు కాల్చగా అవి మహిళలు కూర్చున్న ప్రదేశంలో పడ్డాయి. వారంతా భయంతో పరుగులు తీశారు. ఎంపీ సర్ది చెప్పడానికి ప్రయత్నించగా.. కనీస జాగ్రత్తలు లేకుండా ఎలా కాలుస్తారు? చంపేస్తారా? అని నిలదీశారు. ఈ ఘటనతో చాలామంది వెళ్లిపోయారు. ప్రముఖులు మాట్లాడే సమయానికి ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. భోజనాల వద్దా తోపులాట చోటుచేసుకోవడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘కలుషిత నీటి’పై ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళలు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: ‘తాగేందుకు స్వచ్ఛమైన నీరు రావడం లేదు. కొద్దిసేపు కుళాయిలో వచ్చే నీరూ దుర్వాసన వేస్తోంది’ అని కర్నూలు నగర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా శనివారం 15వ వార్డులోని బుధవారపేట కిందిగేరి కాలనీలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ పర్యటించారు. స్థానిక మహిళలు సమస్యలు మొరపెట్టుకున్నారు. ‘పేరుకే నగరం కానీ, తాగేందుకు మంచినీరూ ఇవ్వడం లేదు. ఎన్ని పథకాలు, రాయితీలు వచ్చినా ఆరోగ్యంగా ఉంటే కదా వాటిని వినియోగించుకునేది’ అని ప్రశ్నించి, అసహనం వ్యక్తం చేశారు. దీంతో మంచినీటి సమస్యనూ పరిష్కరించలేరా అని సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని